తీర్మానం
గుంటూరు : జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు,
జిల్లా అధ్యక్షుల సమావేశంలో రాష్ట్రంలో వ్యవస్థల దుర్వినియోగం, ప్రజా పక్షం
పక్షం వహించేవారి గొంతు నొక్కే చర్యలను ఖండించారు. ఈ మేరకు ఒక తీర్మానాన్ని
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రవేశపెట్టారు.
అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ తీర్మానం పూర్తి పాఠం ఇది. “ప్రజాస్వామ్య
స్ఫూర్తికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా జనసేన పార్టీ ప్రతిఘటిస్తుంది.
ప్రస్తుత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం
కలుగుతోంది. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడానికి ఈ
ప్రభుత్వం అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోంది. ఇటువంటి చర్యలను జనసేన
నిస్సంకోచంగా నిలదీస్తుంది. ఎదురొడ్డి నిలబడుతుంది.
గత ఏడాది విశాఖపట్నంలో జనవాణి నిర్వహించడానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
వెళ్ళిన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి వైసీపీ ప్రభుత్వం పన్నిన
కుట్రలు, కుతంత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు యావత్ భారతదేశం గమనించింది.
అమాయకులైన మా పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలు పాలు
చేసింది. ఇప్పుడు- రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడి ని నంద్యాలలో అరెస్టు చేసిన తీరుని ఈ సమావేశం గర్హిస్తోంది.
అరెస్టు అనంతరం కూడా ఈ ప్రభుత్వం ఎంతలా కర్కశంగా వ్యవహరించిందో ప్రజలంతా
గమనిస్తూనే ఉన్నారు. ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపు చర్యగా జనసేన
భావిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా చేపట్టే ఏ చర్యనైనా జనసేన సమర్ధిస్తుంది. అదే
సమయంలో ప్రజాస్వామ్య వ్యతిరేక పనులను తీవ్రంగా ఖండిస్తుంది. హైదరాబాద్ నుంచి
అమరావతి బయలుదేరిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరికి రావడానికి విమాన
ప్రయాణం నిర్దేశించుకోగా అందుకు అడ్డుపడి విమానం గన్నవరంలో దిగడానికి అనుమతి
లేకుండా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
ఈ పరిస్థితుల్లో రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి మంగళగిరి వస్తున్న
సమయంలో రాష్ట్ర సరిహద్దు వద్ద పార్టీ అధ్యక్షులవారిని నిలువరించడానికి ఈ
ప్రభుత్వం చేసిన అరాచకాన్ని సమావేశం తీవ్రంగా ఖండిస్తోంది. ఒక పార్టీ
అధ్యక్షుడు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఈ రాష్ట్రంలో లేదని ఈ చర్య ద్వారా
వెల్లడవుతోంది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం
పోరాడుతూనే ఉంటామని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అధ్యక్షుల వారిని
రోడ్డుపై పోలీసులు నిలువరించిన సమయంలో మద్దతుగా నిలిచి సంఘీభావం తెలిపిన
పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు ప్రతి
ఒక్కరికీ ఈ సమావేశం కృతజ్ఞతలు తెలుపుతోంది.” అన్నారు.