అది నా నిర్ణయం కాదు, ప్రభుత్వానిది : చంద్రబాబు
రిమాండ్ రిపోర్టులో సిఐడీ కీలక అంశాలు
విజయవాడ : ఏసీబీ కోర్టులో చంద్రబాబును ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి ముందు
సుదీర్ఘ వాదనలు జరిగాయి. తొలుత చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్‌ను
కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, విచారించేందుకు
చంద్రబాబును 15 రోజుల కస్టడీ ఇవ్వాలని సిఐడీ కోరింది. మొత్తం 28 పేజీలతో
రిమాండ్ రిపోర్ట్‌ను సమర్పించింది. సిఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి,
లాయర్లు వివేకాచారి, వెంకటేష్ హాజరు కాగా చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రాతో
పాటు తానే స్వయంగా వాదనలు చెప్పుకుంటానని విజ్ఞప్తి చేసుకున్నారు.
రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే : స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు చంద్రబాబే
ప్రధాన సూత్రధారి. టీడీపీ నేత ఇల్లందుల రమేష్ ద్వారా డిజైన్‌టెక్, సీమెన్స్
ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. కేబినెట్ తీర్మానాల్ని పక్కనపెట్టి, గంటా
సుబ్బారావు, లక్ష్మీనారాయణ లాంటి అధికారుల ద్వారా బాబు కుట్రకు పాల్పడ్డారు.
అచ్చెన్నాయుడు నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ అండ్
ఇన్నోవేషన్ పేరుతో కొత్తశాఖను ఏర్పాటు చేశారు. కేవలం కంపెనీల ప్రతినిధులు
ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ల ఆధారంగానే ప్రాజెక్టుకు ఆమోదం చెప్పారు.
ప్రాజెక్టుకు సంబంధించి మార్కెట్ సర్వే జరగలేదు. ఎలాంటి ప్రాజెక్టు రిపోర్ట్
లేకుండానే సీమెన్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ ఆధారంగా రూ.3,281 కోట్ల బడ్జెట్ ను
కేబినెట్ ముందు పెట్టారు. 90 శాతం ఖర్చు సీమెన్స్ భరిస్తుందని కేబినెట్ కు
అబద్ధాలు చెప్పారు. దీనికి సంబంధించిన నోట్ ఫైల్ ను చంద్రబాబు, అచ్చెన్నాయుడు
అప్రూవ్ చేశారు. ఎలాంటి పర్ఫామెన్స్ గ్యారంటీ, బ్యాంకు గ్యారంటీలు లేకుండానే
ప్రభుత్వం రూ.371 కోట్లను డిజైన్‌టెక్ కు ఇచ్చేసింది. అప్పటి ఆర్థిక శాఖ
కార్యదర్శి కె.సునీత వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదు. అప్పటి
సీఎం, సీఎస్ ఆదేశాలతోనే నిధులు విడుదలయ్యాయి. చంద్రబాబుకు తన వ్యక్తిగత
కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందాయని, స్కిల్ స్కాంకు
సంబంధించిన ఈడీ కూడా విచారణ జరుపుతోందని తెలిపింది. కేసులో మనోజ్ వాసుదేవ్‌కు
సెప్టెంబర్ 5న నోటీసులు ఇచ్చామని, నోటీసులకు జవాబు ఇవ్వకుండా విదేశాలకు
పారిపోయారని సీఐడీ తెలిపింది.
రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలి : ఏసీబి కోర్టులో తన వాదనకు అవకాశం
ఇవ్వాలని చంద్రబాబు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసుకున్నారు. రాజకీయ లబ్ధి కోసమే
నాపై తప్పుడు ఆరోపణలు . రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలి. గవర్నర్ అనుమతి
లేకుండా తనపై కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధం. స్కిల్ డెవలప్మెంట్
కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్ తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ
నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. స్కిల్
డెవలప్మెంట్కు 2015-16 బడ్జెట్లో పొందుపర్చాం. దీనికి రాష్ట్ర అసెంబ్లీ
కూడా ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్
చర్యలతో ప్రశ్నించలేరు. 2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కాని,
రిమాండ్ రిపోర్టులో కూడా నా పాత్ర ఉందని ఎక్కడా సీఐడీ పేర్కొనలేదు. వాదనలు
తర్వాత న్యాయమూర్తి చంద్రబాబును కోర్టు హాల్లోనే ఉంటారా అని ప్రశ్నించగా
విచారణ పూర్తయ్యే వరకు ఉంటానని చంద్రబాబు చెప్పారు. అనంతరం చంద్రబాబు తరపు
న్యాయవాది సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు.
24 గంటల లోపు కోర్టులో ప్రవేశపెట్టాలన్న నిబంధన పాటించలేదు . చంద్రబాబు
దగ్గరకు వచ్చిన పోలీసుల మొబైల్ లొకేషన్ రికార్డ్స్ పరిశీలించాలి. 409 సెక్షన్
ఈ కేసులో పెట్టడం సబబు కాదు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం
చూపాలి. రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలి. చంద్రబాబు తరపున వాదనల తర్వాత సీఐడీ
తరఫున వాదనలు ప్రారంభించారు ఏఏజీ పి.సుధాకర్ రెడ్డి. చంద్రబాబును ఉదయం 6
గంటలకు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఏడుగురిని సీఐడీ ఇప్పటికే అరెస్ట్
చేసింది. 24 గంటలలోపే చంద్రబాబుని కోర్టులో హాజరుపరిచాం. ఈ కేసులో ఏ 35
రిమాండ్‌ను ఇదే కోర్టు తిరస్కరిస్తే అపెక్స్ కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది.
హైకోర్టు ఈ కేసులో ఏ 35 ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా సస్పెండ్ చేసింది.
2015లో జీవో 4 ద్వారా స్కామ్ కు తెర తీశారు. స్కిల్ కేసులో నెల క్రితమే ఈ
కేసులో చంద్రబాబుకి ఈడీ నోటీసులు. 4 ఆగస్టు 2023 న దొండపాటి వెంకట హరీష్ అనే
ఐ ఆర్ ఎస్ అధికారికి నోటీసులు. ఆ నోటీసుల ప్రకారం చంద్రబాబుపై అభియోగాలు.
2017 నుండి 2019 మధ్యలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం. విషయం బయటకు రావడంతో
పెండ్యాల శ్రీనివాస్ పరారీ. ప్రభుత్వ ఉద్యోగి గా ఉంటూ ప్రభుత్వ అనుమతి
లేకుండా ఈ నెల 6 న అమెరికాకు పెండ్యాల శ్రీనివాస్. విజయవాడ ఏసిబి కోర్టులో
సిఐడి తరపున వాదనలు పూర్తయ్యాయి. ఈ సమయంలో న్యాయమూర్తి 15 నిమిషాలు విరామం
ప్రకటించారు. విరామం తర్వాత వాదనలు చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా
కొనసాగించనున్నారు.