సిద్ధార్థ్ లూథ్రా వాదనలు
రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలంటూ బాబు తరఫున న్యాయవాది నోటీస్
విజయవాడ : స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు, టీడీపీ
అధినేత చంద్రబాబుని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ హాజరుపర్చింది. కోర్టులో
సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా
వాదనలు వినిపిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య వాడీవేడీగా వాదనలు సాగుతున్నాయి.
బాబును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. కోర్టు హాల్లో
ఇరువైపుల నుంచి 15 మందికే న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. 409 సెక్షన్‌పై వాదనలు
కొనసాగుతున్నాయి. రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలంటూ బాబు తరఫున న్యాయవాది
నోటీస్ ఇచ్చారు. అరెస్ట్ చేసిన వారిని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలన్న
నిబంధనను సీఐడీ ఉల్లంఘించిందని చంద్రబాబు తరఫున లాయర్ లూథ్రా పేర్కొన్నారు.
సీఐడీ తరఫున న్యాయవాది ఏఏజీ పి.సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 24 గంటల్లోపు
చంద్రబాబును కోర్టు హాజరుపర్చామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు
అరెస్ట్ అయ్యారు. 2015లో విడుదలైన జీవో నెం.4తోనే కుట్ర మొదలైందని ఏఏజీ
అన్నారు.
2018లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన సీఐడీ చంద్రబాబు పాత్రపై
ఆధారాలు సేకరించింది. రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించించిన సీఐడీ
స్కిల్ స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని పేర్కొంది. బాబుపై నేరపూరిత
కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం, మోసం అభియోగాలు ఉన్నాయి. నిన్న ఉదయం ఆరు గంటలకు
చంద్రబాబును అరెస్ట్ చేశాం. స్కిల్ స్కాంలో రూ.550 కోట్ల కుంభకోణం జరిగింది.
ప్రభుత్వ సొమ్మును షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్ ద్వారా దారి మళ్లించారని
సీఐడీ తెలిపింది. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్
కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, ఈ కేసులో
ప్రధాన నిందితుడు (ఏ–1) అయిన నారా చంద్రబాబును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం
(సిట్) శనివారం నంద్యాలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జర్మనీకి చెందిన
సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల
ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదుర్చుకుని, ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టకుండానే
నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయించి అందులో రూ.241 కోట్లను
కొల్లగొట్టిన చంద్రబాబు అవినీతి బండారం ఆధారాలతో సహా బట్టబయలైంది. 2014 నుంచి
2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసిన ముఖ్యమైన నోట్‌ఫైల్స్
కీలక సాక్షాలుగా మారాయి.
నోట్‌ఫైల్‌లో ఏముందంటే : 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని చేశారు. సెప్టెంబర్ 8, 2015న ఒక ఫైల్ సీఎంవో
నుంచి ఆర్ధికశాఖకు వచ్చింది. ఆ ఫైల్ వచ్చిన వెంటనే చీఫ్ సెక్రటరీ నుంచి
ఆర్థికశాఖ సెక్షన్ ఆఫీసర్‌కు పిలుపొచ్చింది. సెప్టెంబర్ 5, 2015న నాటి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు సమావేశం జరిగిందని చీఫ్ సెక్రటరీ తనకు
వెల్లడించినట్టు ఆర్థికశాఖ నోట్‌ఫైల్‌లో ఉంది. ఆ సమావేశానికి సంబంధించి
మినిట్స్ కూడా పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సీమెన్స్
కంపెనీతో ఆగస్టు 21, 2015న ఒప్పందం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించినట్టు
చీఫ్ సెక్రటరీ తనకు తెలిపారని ఆర్థికశాఖ కార్యదర్శి అందులో పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన నిధులను (రూ.371కోట్లను) తక్షణం విడుదల చేయాలని, ఇది
ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన ఆదేశమని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నట్టు నోట్‌ఫైల్‌లో
ఉంది. వీలైనంత త్వరగా ఎం ఓ యు (మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్)
కుదుర్చుకోవాలని సీఎం చెప్పినట్టు ఆర్థికశాఖ వ్యవహారాల్లో పేర్కొన్నారు.
ఆగస్టు 5, 2015న ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిన నోట్‌పై అప్పటి చీఫ్
సెక్రటరీ స్వయంగా కొన్ని కామెంట్లు రాశారు.
దాంట్లో ఏముందంటే : “పారా నెంబర్ 27 ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు
కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం, చర్చల మేరకు తక్షణం బి ఆర్ ఓ
(బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేసేందుకు అవసరమైన పత్రాలు) ను విడుదల చేయాలి”