అమరావతి : వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి
చంద్రబాబుపై రికార్డు స్ధాయిలో ఏకంగా 26 రకాల విచారణలు జరిపించారు. ఇందులో
సభాసంఘం మొదలుకొని సీఐడీ విచారణల వరకూ ఉన్నాయి. కానీ ఒక్కటీ నిరూపణ కాక వాటిని
ప్రభుత్వం వదిలేసింది. చంద్రబాబు తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి
ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో
రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన చంద్రబాబుపై అనేక
అవినీతి ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆరోపణలపై అనేక విచారణలు
జరిపించారు. 14 అంశాలపై సభాసంఘాలు నియమించారు. నీరు-మీరు, ఐమ్యాక్స్
ధియేటర్కు హైదరాబాద్లో భూమి కేటాయింపు, నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ, విశాఖ
డెయిరీ, సాంఘిక, సంక్షేమ హాస్టళ్లలో అవకతవకలు, ప్రాఽథమిక పాఠశాలల్లో
కంఫ్యూటర్ల కొనుగోలు, క్రైస్తవ సంస్థల ఆస్తుల దుర్వినియోగం, ఒంగోలు, చిత్తూరు
సహకార డెయిరీలు, హౌసింగ్ బోర్డు భూముల కేటాయింపు, సర్వ శిక్షా అభియాన్,
ఉపకార వేతనాల్లో అక్రమాలు, హైదరాబాద్లో పార్క్ లాండ్, ఆటోనగర్,
ఎల్బీనగర్, రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ అక్రమాలు, హైదరాబాద్లో జలవిహార్,
ఈట్ స్ట్రీట్లపై సభాసంఘాలు ఏర్పాటయ్యాయి. ఏలేరు కుంభకోణం, రైతుల ఆత్మహత్యలు,
పనికి ఆహార పథకం, కుప్పంలో ఇజ్రాయెల్ ప్రాజెక్టు అమలుపై న్యాయ విచారణలు
జరిగాయి. రిటైర్డ్ న్యాయమూర్తులు ఈ విచారణలు నిర్వహించారు.
హైదరాబాద్ శివార్లలో భూముల కేటాయింపు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భూ
ఒప్పందాలపై మంత్రివర్గ ఉపసంఘాలతో విచారణ జరిపించారు. ప్రత్యేక ప్రధాన
కార్యదర్శితో ఆప్కాబ్పైనా, సీనియర్ ఐఏఎస్ అధికారులతో బలహీనవర్గాల గృహ
నిర్మాణం, పౌర సరఫరాల నిధుల మళ్లింపు, గుంటూరులో దేవాలయ భూముల కొనుగోళ్లపై
విచారణ జరిపించారు. కోనసీమ విద్యుత్ ప్రాజెక్టు, రూ.మూడు కోట్ల చెల్లింపులపై
సీబీసీఐడీతో విచారణ చేయించారు. నాటి ఆర్థికమంత్రి రోశయ్య అధ్యక్షతన ఏర్పాటైన
మంత్రివర్గ ఉపసంఘం టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న 64 భూఒప్పందాలపై పరిశీలన
జరిపింది. అందులో 63 భూ కేటాయింపులు సక్రమమేనని తేల్చింది. ఒక్క ఐఎంజీ భారత్
కంపెనీకి హైదరాబాద్లో క్రీడా వసతుల అభివృద్థికి జరిపిన భూముల కేటాయింపు
సరిగాలేదని పేర్కొంటూ రద్దు చేసింది. ఆ కంపెనీ దీనిపై కోర్టుకు వెళ్లింది.
కుప్పంలో ఇజ్రాయెల్ సహకారంతో చేపట్టిన అధునాతన సేద్యంపై వేసిన న్యాయవిచారణ
కమిటీ ముందు చంద్రబాబు హాజరై తన వాదన వినిపించారు. ఆ కమిటీ కూడా ఆయనను
తప్పుబట్టలేదు. తమ ప్రభుత్వం పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుందని, ఏ తప్పూ
చేయకపోవడంవల్లే ఒక్క విచారణలో కూడా తనను తప్పుబట్టలేదని చంద్రబాబు పలుమార్లు
పేర్కొన్నారు.