తిరుపతి : రాజకీయ అనుభవం ఉంటే, స్కాములు చేస్తే అరెస్టు చేయరా అని విద్యుత్,
మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. స్కిల్
డెవలప్మెంట్ పేరుతో రూ. 371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు బాబు అని
విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ
వాదిస్తున్నాయని మండిపడ్డారు. మొత్తం రూ. 3, 356 కోట్ల ప్రాజెక్ట్ లో 90 శాతం
సీమెన్స్ కంపెనీ, 10 శాతం, అంటే రూ. 371 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన
ప్రాజెక్టులో ప్రభుత్వ డబ్బును మాత్రం ఖర్చు చేయించి, రూ. 371 కోట్లు
చంద్రబాబు అండ్ కో మింగేశారని తెలిపారు. ఏ కారణం లేకుండా ఒక ప్రైవేటు కంపెనీ,
ప్రభుత్వం తరపున రూ. 3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి
ప్రశ్నించారు. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా, చంద్రబాబు స్కామ్ చేశాడని
అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీలు విచారణలు జరిపి,
అరెస్టులు చేశాయని తెలిపారు. సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీల
ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. వారంతా ఈ
కుట్రలో పాత్రధారులు సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని
చెప్పారు. కేవలం ప్రభుత్వం 10 శాతం కింద ఇచ్చిన 371 కోట్ల రూపాయలను
మింగేశారని, షెల్ కంపెనీల ద్వారా, హవాలా మార్గంలో డబ్బులు బదలాయించారని
మండిపడ్డారు.