108 సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో బ్రిటన్ ఎన్ హెచ్ ఎస్ ప్రతినిధుల సహకారం
మొత్తం నాలుగు విడతల్లో శిక్షణ
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
గుంటూరు : ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతిక
పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోగలిగితే విలువైన ప్రాణాలను
కాపాడుకునే అవకాశం ఏర్పడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల
రజిని తెలిపారు. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన
కార్యాలయంలో శుక్రవారం మంత్రి విడదల రజిని యూకే ప్రభుత్వ జాతీయ వైద్య
పథకానికి చెందిన (యూకే ఎన్ హెచ్ ఎస్ ) ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటి
అయ్యారు. 108 వాహనాల్లో పనిచేస్తున్న ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్
టెక్నీషియన్స్)లందరికీ శిక్షణ తరగుతులు ప్రారంభమైన సందర్భంగా వీరంతా
మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలకు
సంబంధించి యూకే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈ సందర్భంగా అవగాహన
కల్పిస్తారని తెలిపారు. 108 వాహనాల్లో పనిచేస్తున్న అత్యవసర వైద్య
సేవల సాంకేతిక సిబ్బందికి ఈ శిక్షణ ఇవ్వడం ద్వారా సరికొత్త విధానాలపై
అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. దేశంలోనే అత్యంత సమర్థవంతంగా మన
రాష్ట్రంలో 108 సర్వీసులు పనిచేస్తున్నాయని చెప్పారు. ఎప్పటికప్పుడు
సాంకేతిక పరిజ్ఞానంపై సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా
ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించే వీలు ఏర్పడుతుందని తెలిపారు. ఈ
సందర్భంగా యూకే ప్రతినిధులు మంత్రికి వారి శిక్షణ మాడ్యూళ్లను
వివరించారు. దశల వారీగా వారు చేస్తున్న కార్యక్రమాలను తెలిపారు. యూకే
ప్రభుత్వం నుంచి రిచ్చర్డ్స్, డేవిడ్, లిజి, ఈమీ, రాధారెడ్డి
పాల్గొన్నారు. అరబిందో ఈఎంఎస్ ఆపరేషన్స్ హెడ్ గంగాధర్ తదితరులు
పాల్గొన్నారు.