విజయవాడ : మీడియాలో పనిచేస్తున్న ఉద్యోగుల రక్షణకు, వారి పరిరక్షణకు తక్షణమే
మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఐజేయూ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి డిమాండ్
చేశారు. మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రతేక
చట్టాన్ని రూపొందించాలని ఆయన కోరారు. ఈ సమస్యల న్నింటిపై అక్టోబర్ 2 గాంధీ
జయంతిన ఢిల్లీలో పెద్ద ఎత్తున జర్నలిస్టులతో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన
తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గురువారం ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ
సభ్యులతో జరిగిన గెట్ టు గెదర్ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాలా పర్యాయాలు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను
దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఒక చట్టం రూపొందించాలని ఈ మేరకు ఐజేయూ ఒక సూచన
చేసిందన్నారు. అంతకుముందు మహారాష్ట్ర, చత్తీస్ గడ్ ప్రభుత్వాలు కూడా
జర్నలిస్టుల పరిరక్షణకు వేర్వేరుగా చట్టం తీసుకొచ్చిందన్నారు. ఇలా ఏ
రాష్ట్రానికి ఆ రాష్ట్రం చట్టాలు తీసుకురావడం కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా
వర్తింపజేసే విధంగా కేంద్రం చట్టం తీసుకురావాలని ఐజేయూ జాతీయ కార్యవర్గాలు ఈ
మేరకు తీర్మానం చేశాయన్నారు. మీడియాలో వచ్చిన అనేక మార్పులు వచ్చాయని,
ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం తర్వాత ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా
వచ్చిందన్నారు. అందువల్ల మొత్తం పరిస్థితిని అవగాహన చేసుకుని దేశవ్యాప్తంగా
మీడియా దాని పరిణామాలు ఏంటి అనేది చర్చించి మీడియాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఏమిటనేది చర్చించడానికి వివిధ వర్గాలకు చెందిన సంబంధించిన వారితో మీడియా
కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ప్రెస్ కమిషన్ కాకుండా
మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనేది చాలాకాలంగా తాము విజ్ఞప్తి చేస్తున్నామని ఈ
మేరకు శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అందువల్ల మొదటిది ప్రెస్ కమిషన్
సూచన మేరకే ఈరోజు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చిందన్నారు. అలాగే చట్టం,
వర్కింగ్ జర్నలిస్టుల న్యూస్ పేపర్స్ ఎంప్లాయిస్ చట్టం, వేజ్ బోర్డు,
అప్లికేషన్స్, జర్నలిస్టుల భద్రతకు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వాలు
తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ వ్యాప్తంగా ఉన్నటువంటి అరకొర చర్యలైనా, ఏ చర్యలైన
మొదటి ప్రెస్ కమిషన్ చేసిన సిఫార్సులేనన్నారు. మొదటి ప్రెస్ కమిషన్ లో
సభ్యులుగా ఉన్నవాళ్లు ఆ తర్వాత కాలంలో ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు,
ఉపరాష్ట్రపతులు, అయ్యారని ఆయన తెలిపారు. రాజ్యాంగపరమైన కీలక పదవులను
అలంకరించారన్నారు. అందువల్ల ఈసారి ఏర్పాటు చేసే మీడియా కమిషన్ కు నిష్ణాతులైన
ప్రముఖులతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంచి చెడులపై సమీక్ష
జరపాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియాపై ఎలాంటి కట్టుబాట్లు లేవని
కానీ ప్రింట్ మీడియాకు మాత్రం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందన్నారు. ఈ
సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ప్రధాన
కార్యదర్శి చందు జనార్ధన్, ఐజేయూ కౌన్సిల్ మెంబర్ ఎస్కే బాబు, ఏపీయూడబ్ల్యూజే
విజయవాడ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్
క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు పాల్గొన్నారు.
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఐజేయూ నేత
శ్రీనివాసరెడ్డి
ఇటీవల పునర్నిర్మాణం చేసిన ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ కార్యాలయాన్ని
ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి గురువారం పారంభించారు.
ఈకార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ప్రధాన
కార్యదర్శి చందు జనార్ధన్, విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి
కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ఐజేయూ
కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు,
దాసరి నాగరాజు, రామారావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్
రమణారెడ్డి, విజయవాడ అధ్యక్షులు సుబ్బారావు, ఏపీపీజే ఫోటో జర్నలిస్ట్
ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, భాస్కరరావు, సాంబశివరావు,
నారాయణ తదితరులు పాల్గొన్నారు.
దివంగత అంబటి కుటుంబాన్ని పరామర్శించిన ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి : ఇటీవల
హృదోగంతో మృతి చెందిన ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు
కుంటుంబాన్ని ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి దంపతులు గురువారం
పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ఆంజనేయులు మృతి చాలా
బాధాకరమని ఆయన లేని లోటు ఐజేయూకు తీర్చడం చాలా కష్టమని ఆయన తెలిపారు.
ఆయనతోపాటు అంబటి కుటుంబాన్ని ఏపీయూడబ్ల్యూజే నాయకులు అందరూ పాల్గొన్నారు.
ఘనంగా ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడుక : ఐజేయూ నేత
శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడుకను ఘనంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో
నిర్వహించారు. సతీ సమేతంగా విజయవాడకు వచ్చిన ఆయనకు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర,
విజయవాడ అర్బన్ కార్యవర్గం ఘనంగా పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఈ
సందర్భంగా సతీసమేతంగా వారిని ప్రెస్ క్లబ్లో శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ
సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే సభ్యులు అందరూ పాల్గొని శ్రీనివాసరెడ్డికి పుట్టిన
రోజు శుభాకాంక్షలను అందజేశారు.