వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ
పథకాల కారణంగా పేదరికం గణనీయంగా తగ్గిందని నీతిఅయోగ్ నివేదికలో వెల్లడైనట్లు
రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా గురువారం పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో
స్పందించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పేదరికం 11.77% ఉండగా జగన్మోహన్
రెడ్డి పాలనతో 6 శాతానికి తగ్గిందని అన్నారు.
ఎమర్జింగ్ ఐటీ సిటీగా విశాఖ
దేశంలో ప్రధాన నగరాలకు దీటుగా ఎమర్జింగ్ ఐటీ సిటీగా విశాఖపట్నం ఎదుగుతోందని
విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు నాస్కామ్-డెలాయిట్ సంస్థలు చేపట్టిన సర్వేలో
ఈ విషయం వెల్లడైందని అన్నారు. దేశవ్యాప్తంగా 26 నగరాలు ఎంపిక కాగా
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంతో పాటు, తిరుపతి, విజయవాడ నగరాలకూ చోటు లభించిందని
అన్నారు. రాష్ట్రంలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభించడానికి విశాఖపట్నం, తిరుపతి,
విజయవాడ నగరాలపై ఐటీ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయని అన్నారు.
చంద్రబాబు ఆంధ్రా కిమ్.
ఆంధ్రప్రదేశ్ ను మొన్నటిదాకా శ్రీలంకతో పోల్చి శునకానందం పొందిన చంద్రబాబు
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉత్తర కొరియా దక్షిణ కొరియా అంటూ
మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. మానసిక వైద్యునికి
చూపించుకోవాలని చెప్తున్నా వినకుండా రోడ్లపై తిరుగుతున్న ఈ ఆంధ్రా కిమ్ కు
పిచ్చి ముదిరి పీక్స్ కు చేరిందని ఏద్దేవా చేశారు.
సానుభూతి డ్రామాకు తెరలేపిన చంద్రబాబు
స్కాంలలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రేపోమాపో తనను అరెస్టు చేస్తారంటూ
సానుభూతి డ్రామాలాడుతున్నాడని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తన భార్యను
అవమానించారంటూ గతంలో బాబు గుక్కపెట్టి ఏడ్చి పండించిన నాటకాన్ని ప్రజలు
ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారని అన్నారు.. ఎన్నికల ముందు బాబు ఎన్ని నాటకాలు
ప్రదర్శించినా ప్రజలు నమ్మరని అన్నారు.