గుంటూరు : రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న వైసీపీని రాజకీయంగా
సంహరించేందుకు ప్రజలు ముందుకు రావాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
పిలుపునిచ్చారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కృష్ణాష్టమి
వేడుకల్లో సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ
సర్కారుపై ధ్వజమెత్తారు. ‘‘ధర్మ రక్షణ కోసం పాటుపడిన భగవంతుడు శ్రీకృష్ణుడు.
ఎందరో అసురులను సంహరించాడు. గతంలో దేశ వ్యతిరేక శక్తులు దేశాన్ని అంధకారంలోకి
నెట్టాయి. మన రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది. ప్రశ్నించిన వారిని
ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరముంది. ప్రజా
కంటక పాలన సాగిస్తోన్న వైసీపీని రాజకీయంగా సంహరించేందుకు ప్రజలు ముందుకు
రావాలి. అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతిలో ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారు.
మూడేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితమైన జగన్ ఇప్పుడే బయటకు వస్తున్నారు.
ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేస్తున్నారు. భూముల డిజిటలైజేషన్
కోసం కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారు. జగనన్న భూ రక్ష పేరుతో పాస్
పుస్తకాలపై తన ఫొటో వేసుకున్నారు. ప్రజల ఆస్తుల మీద కన్నేసి రిజిస్ట్రేషన్
విధానంలో మార్పులు తెచ్చారు. గతంలో ఎవరూ వైకాపా మాదిరిగా ప్రజా కంటక పాలన
చేయలేదు. చంద్రబాబుని కేంద్రం అరెస్టు చేసే అవకాశమే లేదు. రాష్ట్ర
ప్రభుత్వంపైనే చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు భారత్ జోడో
యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ పేరు వద్దని అంటారా?’’ అని
సత్యకుమార్ ప్రశ్నించారు.