జిల్లా ఇంఛార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి
ఏలూరు : జగనన్నకు చెబుదాం -స్పందన ధరఖాస్తులను నాణ్యతతో పాటు నిర్ధేశించిన
సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ బి.
లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ
మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో ఇంఛార్జి కలెక్టర్
బి. లావణ్యవేణితో పాటు డిఆర్ఓ ఎవిఎన్ఎస్ మూర్తి, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు,
జెడ్పి సిఇఓ కె. రవికుమార్, ఆర్డిఓ కె. పెంచల కిషోర్, స్పెషల్ డిప్యూటీ
కలెక్టర్ సత్యనారాయణ హాజరై ప్రజలనుండి ఫిర్యాదులను స్వీకరించారు. జగనన్నకు
చెబుదాం – స్పందన కార్యక్రమంలో 320 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ఈ
సందర్బంగా జిల్లా ఇంఛార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి జిల్లాలోని వివిధ గ్రామాల
నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి
నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన ఫోటోతో సహా అప్ లోడ్ చేయాలని ఇంఛార్జి
కలెక్టర్ ఆదేశించారు. అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని తెలిపారు.
ప్రతి సోమవారం మండల టీం అర్జీల ఆడిట్ పై చర్చించారు. ఈకెవైసి, రీ సర్వే,
రెవిన్యూ సర్వీసెస్ కు సంబంధించిన అంశాలను పెండింగ్ లేకుండా చూడాలని
జిల్లాలోని తహశీల్దార్లను ఆదేశించారు. అనంతరం జిల్లా, మండల అధికారులతో
ఇంఛార్జి కలెక్టర్ బి.లావణ్యవేణి మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు 1,42,283
ఎకరాల్లో ఈక్రాప్ నమోదయిందన్నారు. ఈక్రాప్, ఈకెవైసి లక్ష్యాలను నూరుశాతం
పూర్తి చేయాలన్నారు. ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలను సెప్టెంబరు 15వ తేదీనాటికి
పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే పూర్తయిన భవనాల ప్రారంభ విషయంలో స్ధానిక
ప్రజాప్రతినిధులను దృష్టిలోఉంచుకొని ప్రొటోకాల్ ప్రకారం ప్రారంభోత్సవ
శిలాఫలకాలపై సంబంధితుల పేర్లు ఉండాలని ఈవిషయంలో కలెక్టరేట్ లో సంప్రదించి
ప్రొటోకాల్ ను ఖచ్చితంగా పాటించాలన్నారు.
ఉంగుటూరు మండలం నారాయణపురంకు చెందిన అంగిడి రామలక్ష్మి అర్జీఇస్తూ పోలీసు
శాఖలో పనిచేస్తున్న తన భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఈ విషయంలో
తనకు రక్షణ కల్పించాలని కోరారు. అర్జి అందజేసెందుకు వచ్చిన ఆమె నీరసపడగా
తక్షణమే ఆమెకు అవసరమైన వైద్యాన్ని అందించాలని ఇంఛార్జి కలెక్టర్ సంబంధిత
అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి
సిలైన్ ఎక్కించారు. అనంతరం ఆమె అర్జీను పరిగణలోకి తీసుకోని ఎఫ్ ఐఆర్ నమోదు కు
అవసరమైన చర్యలు తీసుకున్నారు. లింగపాలెం మండలం పుప్పలవారి గూడెంకు చెందిన
రమేష్ బాబు తమకు వేములపల్లి రెవిన్యూ ఏరియాలో భూమి కలిగియున్నదని, ఆ భూమిని
ప్రక్కవారు ఆక్రమించారని మండల సర్వేయర్ ద్వారా తన భూమియొక్క హద్దులు
సర్వేచేయించి తమకు న్యాయం చేయించమని కోరుతూ అర్జీ అందజేశారు. ఈమేరకు తగు
చర్యలు తీసుకోవాలని ఇంఛార్జి కలెక్టర్ లింగపాలెం తహశీల్దారును ఆదేశించారు.
చింతలపూడికి చెందిన స్వర్ణలత తమ భూమికి సంబంధించిన పాస్ బుక్ ను
పొందియున్నానని కానీ, తమ భూమిని ఆన్ లైన్లో నమోదు చేయలేదని నమోదు
చేయించవలసిందిగా అర్జీ అందజేశారు. ఈమేరకు తగు చర్యలు తీసుకోవాలని ఇంఛార్జి
కలెక్టర్ చింతలపూడి తహశీల్దారును ఆదేశించారు. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి
చెందిన విజయ కుమారి తమతోపాటు 7 మందికి 10 ఎకరాల డి-పట్టా భూమి మంజూరైయిందని తమ
ఈ భూమిని ఇతరులు ఆక్రమించుకొంటున్నారని, భూమి ఆక్రమణదారులపై చర్యలు చేపట్టి
తమకు న్యాయం చేయుమని కోరుతూ అర్జీ అందజేశారు. దీనిపై ఇంఛార్జి కలెక్టర్
స్పందిస్తూ ఈ విషయంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆగిరిపల్లి తహశీల్దారును
ఆదేశించారు. వేలేరుపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వెంకయ్య ఆర్ అండ్
ఆర్ ఇళ్ల నోటిఫికేషన్ లో తమ పేరు నమోదు చేయలేదని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిలో తమ
పేరు నమోదు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాని
వేలేరుపాడు తహశీల్దారును ఇంఛార్జి కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ
శాఖల జిల్లా అధికారులు ,కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.