కాకినాడ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి
ఫలాలను ప్రజలకు చేరువ చేసే దిశగా చేపట్టిన గ్రామ సచివాలయం, రైతు భరోసా,
వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన
పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
పంచాయతీరాజ్, వ్యవసాయ, వైద్య ఆరోగ్యం, డ్వామా, డీఎల్డీవోలతో కలిసి ప్రభుత్వ
ప్రాధాన్యత భవనాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా
శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ
శాశ్వత భవన నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పూర్తయిన
భవనాలను వెంటనే హ్యాండ్ ఓవర్ చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. ఇసుక,
సిమెంటు, ఐరన్ ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా స్థాయి
అధికారులు క్షేత్రస్థాయి ఇంజనీరులతో సమన్వయం చేసుకుని నిర్దేశించిన
లక్ష్యానికి అనుగుణంగా పనులలో ప్రగతి చూపాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం
చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, డీఎం అండ్ హెచ్వో డా.
జె.నరసింహ నాయక్, ఇన్చార్జ్ డ్వామా పీడీ ఎం.భానుప్రకాష్, పంచాయతీ రాజ్
సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసు, ఆయా మండలాల డీఈలు, కాకినాడ పెద్దాపురం
డీఎల్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.