ఏకగ్రీవంగా ఎన్నికైన మేకా రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర
హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్యఅతిథిగా
హాజరయ్యారు. సోమవారం చాగల్లు పంచాయతీ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా
నిర్వహించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అందరూ
కలిసి సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ నేపథ్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్,
వార్డు సభ్యులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయాలని దృఢ
సంకల్పంతో సేవ చేసినప్పుడే గ్రామ అభివృద్ధి చెందుతుందన్నారు.
ప్రతి నెల ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నా
సమావేశంలో చర్చించుకుని ఆ సమస్యను పరిష్కరించే దిశగా తోడ్పడాలని సూచించారు.
చాగల్లు మేజర్ పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 17 వార్డులు అధికార పార్టీ
మద్దతుదారులు గెలుపొందారని, ఆనాడు ఉప సర్పంచ్ పదవి రెండున్నర ఏళ్ళు ఒప్పందంతో
ఈ ఉప ఎన్నిక వచ్చినట్లు ఆమె తెలిపారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి మరోసారి
జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తానేటి వనిత కోరారు. ఈ కార్యక్రమంలో
స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.