వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
గుంటూరు : పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు
నిర్వహించాలనే ప్రతిపాదనపై నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని రాజ్యసభ
సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు
సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఈ అంశానికి సంబంధించి పలు విషయాలు వివరించారు.
నిజానికి లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల పదవీకాలం (ఐదేళ్లు) ముగిసే లోపు తగిన
కారణాలతో రద్దుచేసి ముందస్తు లేదా మధ్యంతర ఎన్నికలు జరిపించే వెసులుబాటు భారత
రాజ్యాంగం కల్పించిందని అన్నారు. అదీగాక కేంద్రంలో, అన్ని రాష్ట్రాల్లో రాజకీయ
సంక్షోభాలు తలెత్తి సుస్థిర ప్రభుత్వాలు మనగలిగే పరిస్థితులు లేనప్పుడు
పదవీకాలం పూర్తికాకుండానే దిగువ చట్టసభలను రద్దు చేయించి తాజా ఎలక్షన్లు
పెట్టడం 1950ల నుంచే దేశంలో జరుగుతోందని వివరించారు. మొదటి సాధారణ ఎన్నికలు
(1952లో) అన్ని రాష్ట్రాల శాసనసభలకు లోక్ సభతోపాటే జరిగాయి. ఆ తర్వాత కొన్ని
రాజకీయ పరిణామాల వల్ల కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల పదవీకాలం ముగియకుండానే
వాటిని రద్దుచేసి ఎన్నికలు జరిపించారుని గుర్తుచేశారు. 1955 ఆరంభంలో అప్పటి
ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయిని గుర్తుచేశారు. 1967
సాధారణ ఎన్నికల నాటికి పార్లమెంటుతోపాటు ఎన్నికలు జరగని రాష్ట్రాల సంఖ్య
క్రమంగా పెరిగిందని అన్నారు. గత 20 ఏళ్లుగా దేశంలో లోక్ సభతోపాటు అసెంబ్లీ
ఎన్నికలు జరిగే రాష్ట్రాల సంఖ్య బాగా తగ్గిందని అన్నారు. 2019లో లోక్ సభ
ఎన్నికలతోపాటు కేవలం నాలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్
ప్రదేశ్, సిక్కిం) శాసనసభలకు మాత్రమే పోలింగ్ జరిగిందని అన్నారు. ప్రతి ఏటా
దేశంలో సగటున ఐదారు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారని. ఈ
నేపథ్యంలో పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పటి ఏపీ, తెలంగాణ అసెంబ్లీలకు
పార్లమెంటుతోపాటు ఎప్పుడెప్పుడు ఎన్నికలు నిర్వహించినదీ ఆయన వివరించారు.
అవతరించిన ఏడాదికే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ రద్దు
మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి ఇప్పటి తెలుగు రాష్ట్రాలున్న
ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణ లు వరుసగా పూర్వపు మద్రాసు, హైదరాబాద్ రాష్ట్రాల్లో
అంతర్భాగాలు. 1953 అక్టోబర్ ఒకటిన అవతరించిన ఆంధ్ర రాష్ట్రంలో దాని మొదటి
అసెంబ్లీ పదవీకాలం ముగియడానికి రెండేళ్ల ముందే 1954 చివర్లో రద్దయిందని
అన్నారు. ఫలితంగా 1955 ఆరంభంలో ఆంధ్రా రెండో శాసనసభకు ఎన్నికలు నిర్వహించారని
తెలిపారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల
పదవీకాలం రెండేళ్లు పొడగించారు. దీంతో 1957 పార్లమెంటు ఎన్నికలతోపాటు నాటి
ఉమ్మడి ఏపీలోని తెలంగాణ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఎలక్షన్లు
పెట్టారని గుర్తుచేశారు. అయితే, 1962లో పార్లమెంటుతోపాటు ఏపీలోని అన్ని
అసెంబ్లీ సీట్లకూ ఎన్నికలు జరిపించారు. ఇలాగే 1967 లోక్ సభ ఎన్నికలతోపాటే ఏపీ
శాసనసభ ఎన్నికలు జరిపించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తన కాంగ్రెస్
సర్కారుకు మెజారిటీ ఉన్నా ఏడాది ముందే లోక్ సభను రద్దుచేయించి 1971 ఆరంభంలో
ఎన్నికలు జరిపించారని చెప్పారు. అందుకే 1972లో ఇతర కొన్ని రాష్ట్రాలతోపాటు
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించారు. ఎమర్జెన్సీ కాలంలో దిగువ
చట్టసభల పదవీకాలం పొడిగించడంతో 1977లో పార్లమెంటు ఎన్నికలు జరిగినా, ఏపీ
అసెంబ్లీ ఎన్నికలు 1978లో జరిపించారని అన్నారు. ఇలా ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు
ఎన్నికలు వేర్వేరు సంవత్సరాల్లో జరగడం ఆనవాయితీగా మారింది. లోక్ సభతోపాటు
కాకుండా ఏపీ శాసనసభ ఎన్నికలు విడిగా అంటే కొన్ని ఇతర రాష్ట్రాలతోపాటు
(కర్ణాటక, తర్వాత ఒడిశా) జరగడం సాధారణ విషయంగా మారిపోయిందని తెలిపారు. 1978
తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 1983, 1985లో ఇలా పార్లమెంటుతో సంబంధం లేకుండా
విడిగా జరిగాయని గుర్తుచేశారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆరు నెలల ముందే
తెలుగు అసెంబ్లీకి 1989 డిసెంబర్లో లోక్ సభతోపాటు ఎన్నికలు జరిపించారని
అన్నారు. ఎన్నికల తర్వాత ఏర్పడిన 9వ లోక్ సభ ఏడాదిన్నరకే రద్దవడంతో ఏపీ
అసెంబ్లీ ఎన్నికలు తర్వాత విడిగా 1994 డిసెంబర్లో జరిగాయి. అయితే ఏపీ
అసెంబ్లీకి కొద్ది నెలల ముందే ఎన్నికల జరిపించాలనే టీడీపీ కేబినెట్ నిర్ణయం
వల్ల 1999 పార్లమెంటు మధ్యంతర ఎన్నికలతోపాటే తెలుగు శాసనసభకూ ఎలక్షన్లు
నిర్వహించారని అన్నారు. ఆ తర్వాత నుంచి అంటే 21వ శతాబ్దంలో జరిగిన మొదటి మూడు
ఎన్నికలూ (2004, 2009, 2014) పార్లమెంటుతో పాటే ఉమ్మడి ఏపీ అసెంబ్లీలకూ
జరిగాయని గుర్తుచేశారు. 2014 నాటికి ఏపీ విభజన ప్రక్రియ పూర్తికాకపోవడంతో
రాష్ట్ర శాసనసభ ఎన్నికలు పార్లమెంటుతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టేనని
అన్నారు. తెలంగాణ మొదటి అసెంబ్లీ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందే దాన్ని
రద్దు చేయించి 2018 డిసెంబర్లో తాజాగా ఎన్నికలు జరిపించారు. దీని వల్ల రెండు
తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం లేకుండా పోయింది. పైన
చెప్పినట్టు 17వ లోక్ సభ ఎన్నికలతోపాటు 2019 ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఇలా ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి కొన్నిసార్లు
పార్లమెంటుతో పాటు, మరి కొన్ని సార్లు విడిగా ఎన్నికలు జరిగాయని
విజయసాయిరెడ్డి వివరించారు.