మనస్సున్న వ్యక్తి పాలకుడు అయితే ప్రజలు ఎంత సుభిక్షంగా ఉంటారో నిరూపించారు
వైయస్ జగన్ తండ్రి వైయస్సార్ బాటలోనే నడుస్తూ ఇచ్చిన ప్రతి మాట
నెరవేరుస్తున్నారు
సంక్షేమ పాలనలో, పేదరిక నిర్మూలనలో సిఎం జగన్ వైయస్సార్ తరహా ముద్ర
అణగారిన వర్గాల, నిస్సహాయుల జీవితాలలో కులమతాలకు అతీతంగా వైయస్ జగన్ అద్భుత
వెలుగులు తెచ్చారు
వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రాష్ర్ట మంత్రులు
మేరుగ నాగార్జున, జోగి రమేష్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల
రామకృష్ణారెడ్డి, ఎంఎల్ సీ లేళ్ళ అప్పిరెడ్డి
గుంటూరు : రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలో, సంక్షేమ పాలనలో ముఖ్యమంత్రి వైయస్
జగన్ మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తరహా ముద్రవేశారని వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం పార్టీ కేంద్ర కార్యాలయంలో
శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్,
పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంఎల్సీ లేళ్ళ అప్పిరెడ్డి,
ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు, నారమల్లి పద్మజ, ఎస్సీ కార్పోరేషన్
ఛైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగతో పాటు పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు,
డైరక్టర్లు, పార్టీ నేతలు వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు
అర్పించారు. పేదలకు దుస్తులు పంపిణి చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని
నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సంస్ధ సమన్వయంతో నిర్వహించారు.
పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మనస్సుతో
పరిపాలన చేసిన మహానేత వైయస్సార్ అని అంటూ మంచి మనస్సున్న వ్యక్తి పాలకుడు
అయితే ప్రజలు ఎంత సుభిక్షంగా ఉంటారో నిరూపించారన్నారు. పేదవాడికి మేలు
చేయాలన్న తలంపుతోనే వైయస్సార్ ప్రతి పధకాన్ని అమలు చేశారని వివరించారు.అందుకనే
ప్రజల హృదయాలలో వైయస్ రాజశేఖరరెడ్డి అంతగా పెనవేసుకుపోయారన్నారు. వైయస్ జగన్
తండ్రి వైయస్సార్ బాటలోనే నడుస్తూ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నారు.
ముఖ్యంగా తాను ఏపని అయితే నెరవేర్చగలడో దానిని ఆలోచించి ప్రజలకు హామీ ఇచ్చి
తర్వాత ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తున్నారని ఈ విషయంలో వైయస్
రాజశేఖరరెడ్డి ఆలోచనలు, ముద్ర ప్రతి అంశంలో మనకు గుర్తుకువస్తుందన్నారు.
ఒక్కసారి గతం గుర్తుకు తెచ్చుకుంటే సరిగ్గా ఇదే రోజు వైయస్సార్ ప్రయాణించిన
హెలీకాప్టర్ కనిపించలేదు అన్నారు అయినా ఒక ధీమా ఉంది. ఆయన ఎక్కడికి వెళతారు.
ఖచ్చితంగా వస్తారు అనుకున్నాం. కానీ దురదృష్టం ప్రమాదం రూపంలో ఆయనను
కోల్పోయాం. ప్రజలు పెద్ద దిక్కును కోల్పోయారు. అనేక మంది అభిమానుల గుండె
ఆగింది. ఒక వ్యక్తి పాలన పై, ప్రజల జీవితాల పై ఎంతగా ప్రభావితం చేయగలరు
అనేందుకు వైయస్సార్ జీవితమే ఒక ఉదాహరణ అన్నారు. కోట్లాది ప్రజల హృదయాలలో వైయస్
రాజశేఖరరెడ్డి నిలిచిపోయారన్నారు. వైయస్సార్ సిద్ధాంతాలు పెట్టుకుని
పాలించలేదని, అందరూ తన కుటుంబ సభ్యులే అనుకున్నారన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్
ను ఉన్నతస్ధానంలో నిలబెట్టారన్నారు. ప్రజల జీవితాల్లో ఒక వెలుగు
తెచ్చారన్నారు. వైయస్సార్ మరణం తర్వాత అలుముకున్న చీకటిలో వెలుగు రేఖలు
తెచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. మాట మీద నిలబడే తత్వమే
ప్రజల్లో వైయస్ అంటే ఒక నమ్మకాన్ని సృష్టించిందని ఆయనకు నిజమైన రాజకీయ
వారసుడిగా జగన్ గత నాలుగేళ్లుగా పాలన చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు
పొందుతున్నారని వివరించారు. అన్నార్తులకు ఆరాధ్యుడుగా వైయస్సార్ నిలిచారు.
దివంగత మహానేత వైయస్ఆర్ పేదలు, అణగారిన వర్గాల పాలిట దేవుడయ్యారు. ఆయన మనకు
దూరమైన తరువాత ఆయన స్థానాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భర్తీ చేశారన్నారు.
కేవలం ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వైయస్సార్ ప్రజలమీద చెరగని ముద్ర వేశారు.
ఇప్పటికీ తన అద్భుత పాలనతో ప్రజల మనసుల్లో వైయస్సార్ జీవించి ఉన్నారన్నారు.
సాంఘిక సంక్షేమ శాఖమంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ మహానేత వైయస్సార్
పేదప్రజల గుండెచప్పుడు అని అన్నారు.రాష్ర్టంలో అనేక సంస్కరణలకు ఆద్యుడుగా
నిలిచారన్నారు. ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్ దేనని
అన్నారు. ముఖ్యంగా పేదప్రజల కోసం ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అనేక
పధకాలను అమలు చేసి సంక్షేమ సారధిగా నిలిచారన్నారు. తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి
అడుగుజాడల్లో ముఖ్యమంత్రి జగన్ నడుస్తూ పేదల పక్షాన నిలిచారన్నారు. ముఖ్యంగా
సమాజంలోని అణగారిన వర్గాలకు ఎవరికి ఏం కావాలో వాటిని గుర్తించి అమలు చేస్తున్న
దూరదృష్టి గల నేత జగన్ అని వివరించారు.
గృహనిర్మాణశాఖమంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ వైయస్ గుర్తుకు వచ్చినప్పుడల్లా
ఒక్కసారి కాలం వెనక్కి వెళితే బాగుండు అని మనస్సుకు అనిపిస్తుందని అన్నారు.
ఇప్పటికీ వైయస్సార్ మనకు సజీవంగా ఉన్నట్లే అనిపిస్తుందని తెలియచేశారు.
వైయస్సార్ నడకలో ఒక ఠీవి ఉండేదని అన్నారు. పేదవాడి గుండె తాకితే వైయస్సార్
అని వినిపిస్తుందని తెలిపారు. వైయస్ రాజశేఖరరెడ్డి గొప్ప మానవతా వాది అని
కొనియాడారు. పేదప్రజలకు మేలు చేసే విషయంలో వైయస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు
వేస్తే ఆయన బాటలో వైయస్ జగన్ నాలుగు అడుగులు వేస్తున్నారని అన్నారు.
ఎం ఎల్ సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ ప్రజా హృదయ నేత అన్నారు.
వైయస్ఆర్ ను తలుచుకుంటే ప్రతి పేదవాడికి అండ దొరికేదన్నారు. ఆయన అజాత
శత్రువుగా పేరు పొందారన్నారు. వైఎస్ చూపిన బాట ప్రతి రాజకీయ నేతకు
అదర్శమన్నారు.