ఎన్నికల ముందు పేదలపై సవతి ప్రేమ
అధిక ధరలతో ఒళ్లంతా వాతలు
గ్యాస్ తగ్గింపు పేరుతో దృష్టి మరల్చే కుట్ర
రాష్ట్రంలో వైసీపీ తీరు పైనా ప్రజాగ్రహం
ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఎన్నికల నాటకాలను ప్రజలందరూ
గమనిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. దేశంలో
త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, గత పదేళ్లలో
రెట్టింపు చేసిన గ్యాస్ బండ ధరపై హటాత్తుగా రూ.200 తగ్గించడాన్ని ఎద్దేవా
చేశారు. ఈ మేరకు శుక్రవారం పీసీసీ అధ్యక్షులు ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ
మొసలి కన్నీరును, అదే విధంగా ఎన్నికల ముందు పేదలపై కురిపిస్తున్న సవతి తల్లి
ప్రేమను అందరూ గమనిస్తున్నారని తెలిపారు. అదానీ అక్రమ ఆర్థిక లావాదేవీలు
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నేపధ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కంటి
తుడుపు చర్యగా రూ.200 తగ్గిస్తున్నామని కేంద్రం ప్రకటించినట్లు వెల్లడించారు.
ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నా దేశం లక్షల కోట్ల రూపాయిల అప్పుల్లో
కూరుకుపోయిన దానిపై కేంద్రం సమాధానం చెప్పాలని ఆయన తెలిపారు. బీజేపీ గద్దె
ఎక్కిన పదేళ్లలో రూ.480 నుంచి రూ.1053కి 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో
నుంచి దిగే సమయానికి గ్యాస్ సిలెండర్ ధర రూ.480 ఉండేదని గత పదేళ్ల కాలంలో
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతూ
ప్రస్తుతానికి రూ.1053 చేసిందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు.
అదే విధంగా గతంలో ఉల్లిపాయలు కేజీ రూ.10 నుంచి 100 వరకు టమాటాలు కేజీ రూ.10
నుంచి 200 వరకు పెరిగి సామాన్యులకు నిత్యావసరాల కొనుగోలు పెను భారంగా మారాయని
గుర్తు చేశారు. వంటకు వాడుకునే ఆయిల్ ధరలు 2014 నుంచి 2023 నాటికి లీటర్ రూ.35
నుంచి రూ. 120కు చేరిందని, గత పదేళ్లలో పెట్రోల్ ధరలు కూడా రూ.66 నుంచి
రూ.110కు పెరిగాయని తెలిపారు. అదే విధంగా దశాబ్ధకాలంలో అంతర్జాతీయ మార్కెట్ లో
క్రూడాయిల్ ధరలు మాత్రం బ్యారెల్ కు 101 డాలర్ల నుంచి 86 డాలర్లకు తగ్గిన
విషయాన్ని అందరూ గమనించాలని ఆయన కోరారు.
8.33 లక్షల కోట్ల దోపిడీ
దేశంలోని సుమారు 31.37 కోట్ల లబ్ధిదారుల నుంచి గ్యాస్ ధరల పెంపు పేరుతో సుమారు
పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రూ.8,33,640 కోట్లను పేదల నుంచి దోపిడీ చేసిందని
పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఉజ్వల పథకం కింద 2017 నుంచే
రూ.68,702 కోట్ల ప్రజా ధనాన్ని లూఠీ చేశారని వెల్లడించారు. 2020 నుంచి నగదు
బదిలీ పథకం అంటూ కనీసం సబ్సిడీ కూడా సరిగ్గా అందించడం లేదని పేర్కొన్నారు.
బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన పేదలు మరింత పేదలుగా,
ధనికులు అపర కుబేరులుగా మారుతున్నారని తెలిపారు. దశాబ్ధ కాలంలో పెరిగిన అదానీ,
అంబానీ ఆస్తుల విలువే దీనికి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో వైసీపీ తీరూ ఆక్షేపణీయం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉందని పీసీసీ అధ్యక్షులు
వెల్లడించారు. మణిపూర్ లో క్రైస్తవులు, గిరిజనులపై జరిగిన దాడులు విషయంలోనూ
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీసం ఒక మాట మాట్లాడక పోవడం సిగ్గు చేటని తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా జరుగుతున్న దళితులపై దాడులు,
అత్యాచారాలు, ఆర్థిక నేరాలు, అదానీ సంస్థల మోసాల నుంచి ప్రజల ద్రుష్టి మరల్చ
డానికే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ తగ్గింపు
వంటి నీచ రాజకీయాలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా కేసుల
భయంతో కేంద్రం అడుగులకు మడుగులెత్తుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని
కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. అధిక
ధరలు, అన్యాయాలపై గ్రామ స్థాయిలో తమ గళాన్ని గట్టిగా వినిపించాలని తెలిపారు.
గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పట్ల ఉన్న సానుభూతిని స్థానిక నేతలు పార్టీకి
అనుకూలంగా మార్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే
ఇందిరమ్మ రాజ్యంతోనే ఇంటింటా సౌభాగ్యం వస్తుందని చెప్పాలని వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వాటి వల్ల సామాన్య
పేదలకు జరిగే నష్టాన్ని ప్రజలందరికీ వివరించాలని పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్
శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.