ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే అధికార పార్టీలకు ఇబ్బందే
ఎన్డీయే లో లేని టీడీపీకి 15 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం
వైసీపీ 3-4 సీట్లకే పరిమితం..మిగిలిన సీట్లలో హోరా హోరీ పోటీ
సోషల్ మీడియాలో ప్రముఖ జాతీయ ఛానల్ ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే వైరల్ మారింది.
జాతీయ ఛానల్ సర్వేతో ఏపీలో అధికార వైసీపీ పార్టీలో కలవరం మొదలైంది.
ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఎన్డీయే లో లేని టీడీపీకి 15
నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఎన్డీయేలో ఉన్న ఏ
పార్టీకీ ఇన్ని సీట్లు రావని జాతీయ సర్వే అంచనా వేసింది. సర్వే ఫలితాలను
జాతీయ ఆంగ్ల ఛానల్ విడుదల చేసింది. సర్వే వైరల్‌గా మారడంతో వైసీపీ శ్రేణుల
గుండెల్లో గుబులు మొదలైంది. ఇదిలా ఉండగా సదరు జాతీయ ఛానల్ ఆంధ్రప్రదేశ్‌లో
ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిస్థితులపై చేసిన సర్వే రిపోర్ట్స్‌ను తెలుగు
తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఉంచారు. ఆగస్ట్ 2022లో ఇదే ఛానల్ టీడీపీకి
ఆంధ్రప్రదేశ్‌లో 7 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయని, జనవరి 2023లో టీడీపీ 10
ఎంపీ సీట్లలో సత్తా చాటుతుందని అంచనా వేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
ఆగస్ట్ 2023లో తాజాగా 15 నుంచి 20 పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం గెలిచే
అవకాశం ఉందని, అది కూడా ఎన్డీయేతో ఎలాంటి పొత్తు లేకుండా అని సదరు ఛానల్ అంచనా
వేసిన విషయాన్ని తెలుగు తమ్ముళ్లు హైలైట్ చేస్తున్నారు. ఎన్నికల నాటికి
పరిస్థితి మరింత మారుతుందని, టీడీపీ మరిన్ని పార్లమెంట్ స్థానాల్లో సత్తా
చాటడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వేకు
సంబంధించిన వీడియో వైసీపీలో అంతర్గత చర్చకు దారితీసింది. ప్రభుత్వ వ్యతిరేకత
ఉందని తమకూ తెలుసని కానీ మరీ ఈ స్థాయిలో ఉందని అనుకోలేదని వైసీపీ నేతలు
గుసగుసలాడుకుంటున్నారు. అధినేత ఇప్పటికైనా మేలుకోవాలని, పరిస్థితి ఇలానే
కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లోనే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
బొక్కబోర్లాపడే పరిస్థితులు దాపురిస్తాయని వైసీపీ నేతల్లో ఆందోళన
వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా ఇదే జాతీయ ఛానల్ తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఒక
అంచనా వేసింది. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో 4 సీట్లను ఎన్డీయే
దక్కించుకునే అవకాశం ఉందని సర్వే చెప్పుకొచ్చింది. ఎన్డీయే ఓట్ షేర్ 23 శాతం
ఉండొచ్చని తెలిపింది. కాంగ్రెస్ 7 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని
పేర్కొంది. ఓట్ షేర్ 38 శాతంగా వెల్లడించింది. ఇక 39 శాతం ఓట్ షేర్‌తో మిగిలిన
6 స్థానాల్లో ఇతర రాజకీయ పార్టీలు గెలిచే అవకాశం ఉందని సదరు జాతీయ ఛానల్ అంచనా
వేసింది. నరేంద్ర మోడీ మూడోసారి కూడా ప్రధానిగా బాధ్యతలు చేపడతారని మెజార్టీ
ప్రజలు విశ్వసిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది కన్నా తక్కువ సమయం ఉన్న
నేపథ్యంలో ఇండియా టుడే-సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరుతో ఈ నెలలో నిర్వహించిన
సర్వేలో ఈ విషయం తేలింది. సర్వేలో 52 శాతం మంది ఈ విషయాన్ని చెప్పారు. 63 శాతం
మంది ప్రధానిగా మోడీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం
జరిపిన సర్వేలో 72 శాతం మంది సంతృప్తి చెందగా ఇప్పుడు కాస్త తగ్గింది. మోడీ
పనితీరు యావరేజ్‌గా ఉందని 13 శాతం మంది, బాగులేదని 22 శాతం మంది తెలిపారు.
మోడీని చూసే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తామని 44 శాతం మంది చెప్పారు.
అభివృద్ధి, హిందుత్వ అంశాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నా వాటికి అంత
ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఏపీలో అధికార పార్టీ వైసీపీ పనైపోయిందన్న చర్చ గత కొంత కాలంగా రాజకీయ వర్గాలలో
తీవ్రంగా జరుగుతోంది. ఇప్పటికే పలు సర్వేలలో వైసీపీకి ఈసారి ఘోర పరాజయం
తప్పదనే విషయం బయటపడగా ప్రజలలో తీవ్రంగా కనిపిస్తున్న అసంతృప్తితో పలువురు
పరిశీలకులు కూడా ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టేశారు. ప్రభుత్వం చేపట్టిన
సంక్షేమ పథకాలే మమ్మల్ని మరోసారి అందలం ఎక్కిస్తాయని వైసీపీ నేతలు మేకపోతు
గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం తెగ మదన పడుతున్నారు. జలలో
అసంతృప్తిని దారి మళ్లించి మాఫీ అయ్యేలా చేసుకొనేందుకు అన్ని విధాలుగా
ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని నేతల మీదకి మళ్లించి
ఆయా స్థానాలలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు వైసీపీ పెద్దలు
ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టు డే ఓ
సర్వే నిర్వహించింది. అయితే, ఈ సర్వేలో వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్
అయ్యే ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఏపీలో
టీడీపీకి 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వే తేల్చింది. ఈ 15
ఎంపీ సీట్లను కూడా టీడీపీ ఒంటరిగానే సాధించేస్తుందని చెప్పడం మరో విశేషం. అదే
సమయంలో వైసీపీ 3-4 సీట్లకే పరిమితమవుతుందని చెప్పగా మిగిలిన సీట్లలో హోరా హోరీ
పోటీ ఉంటుందని, రాజకీయ సమీకణాలను బట్టి ఆయా స్థానాలలో ఫలితాలు ఉండనున్నాయని
వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది. దీంతో నష్ట
నివారణ చర్యలపై దృష్టిపెట్టింది. వైసీపీ ప్రజలలో అసంతృప్తి ఎక్కువగా ఉన్న
ఎంపీలను పోటీ నుండి తప్పించేసే పని మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది. మరోవైపు
వివిధ నియోజకవర్గాల్లో గ్రాఫ్ మెరుగుపడని ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి
దించడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించుకోవచ్చని వైసీపీ భావిస్తున్నట్లు
తెలుస్తోంది. స్థానాల మార్పులో భాగంగా శ్రీకాకుళం ఎంపీగా ధర్మాన సోదరుల్లో
ఒకరిని, లేదంటే స్పీకర్ తమ్మినేనిని రంగంలోకి దింపనున్నారట. తనయుడికి
ఎమ్మెల్యే సీటు ఇస్తే తమ్మినేని ఎంపీగా పోటీకి వెళ్లడం గ్యారంటీగా
కనిపిస్తుంది. ఇక అనకాపల్లి ఎంపీ సత్యవతిని అసెంబ్లీకి పంపి మంత్రి గుడివాడ
అమర్నాథ్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అవంతి శ్రీనివాస్ లలో ఒకరిని ఎంపీగా పోటీ
చేయించనున్నారట. అలాగే కాకినాడ ఎంపీ వంగవీటి గీతను తప్పించి మాజీమంత్రి కురసాల
కన్నబాబు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని పోటీ నుండి తప్పించి ఇక్కడ కూడా ఎవరొకరు
ఎమ్మెల్యేను దింపనున్నట్లు తెలుస్తుంది. అమలాపురం ఎంపీగా మంత్రి విశ్వరూప్
పోటీ చేయనుండగా బదులుగా ఆయన తనయుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు
తెలుస్తుంది. కాగా రామచంద్రాపురంలో మంత్రి వేణు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు
మధ్య పంచాయితీ తెలిసిందే. దీనికి పరిష్కారంగా వేణును రాజమండ్రి ఎంపీగా బరిలోకి
దింపే అవకాశాలున్నాయి. ఇక నరసాపురం ఎంపీగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు,
ఏలూరు ఎంపీగా మాజీమంత్రి ఆళ్ల నాని, లేదా ప్రముఖ పారిశ్రామికవేత్త అరసవెల్లి
అరవింద్, నరసరావుపేట నుండి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును పొన్నూరు
ఎమ్మెల్యేగా సీటు ఇచ్చి ఇక్కడ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఎంపీగా
పోటీకి దించనున్నట్లు తెలుస్తుంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే గూడూరు ఎంపీగా
ఉన్న డాక్టర్ మద్దిల గురుమూర్తిని గూడూరు అసెంబ్లీకి పంపి ఇక్కడ ఎమ్మెల్యేగా
ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ ను తిరుపతి ఎంపీగా పోటీ చేయించనున్నారట.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఈసారి ఎన్నికల నుండి తప్పించనుండగా ఈ
స్థానంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ను ఎంపీగా పోటీ చేయిన్చానున్నట్లు తెలుస్తుంది.
ఇవన్నీ వైసీపీ అధిష్టానం ప్రణాళిక కాగా ఇందులో ఎంతమంది ఎమ్మెల్యేలు
పార్లమెంటుకు వెళ్లేందుకు ఇష్టపడతారన్నది చూడాల్సి ఉంది.