ఘనంగా గిడుగు వేంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు
మధురమైన తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది
ఉత్తరాంధ్ర, పల్నాడు, అనంతపురం, విజయవాడ, గుంటూరు, రాజ మహేంద్రవరంలో తెలుగు
మహోత్సవాలు
రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ
అధ్యక్షులు పి. విజయబాబు
విజయవాడ : తెలుగు భాషను సామాన్య ప్రజలకు అర్థమయ్యేవిధంగా వ్యవహారిక భాషలో
రచనలు, ఉధ్యమాలు చేసిన సంఘ సంస్కర్త గిడుగు వేంకట రామమూర్తి పంతులు అని
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ
అధ్యక్షులు పి. విజయ బాబు అన్నారు. గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతిని
పురష్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో
రాష్ట్ర స్థాయి తెలుగు భాషా మహోత్సవాలను భాషా సాంస్కృతిక శాఖ, అధికార భాషా
సంఘాల ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పి. విజయ బాబు మాట్లాడుతూ గిడుగు వేంకట రామమూర్తి పంతులు
వ్యవహారిక భాషకు నాంది పలికారని కొనియాడారు. గిరిజన ప్రజలు మాట్లాడే సవర భాషకు
లిపి రూపొందించి వారి సముద్ధరణ కోసం ఎనలేని కృషి చేశారన్నారు. అందుకే ప్రతి
ఏటా ఆగస్టు 29న గిడుగు రామమూర్తి పంతులు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు
భాషా దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. ఎన్ని భాషలు విద్యలు నేర్చినా మాతృభాష
గొప్పదనాన్ని మర్చిపోకూడని, మధురమైన తెలుగు భాషను, సాహిత్యాన్ని పరిరక్షించి
రానున్న తరాలకు అపురూప సంపదగా అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగు భాషా వారోత్సవాలను అత్యంత
వేడుకగా నిర్వహించామన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 23న అత్యంత
వైభవంగా వేడుకలు ప్రారంభం కాగా తెలుగుదనమంతా నిబిడీకృతమైనట్లుగా వారం
రోజులపాటు వేడుకలు జరిగాయన్నారు. తెలుగు భాష అపురూపమైందని, విశిష్టమైందని
అందుకే తెలుగు అజరామరంగా వర్ధిల్లుతోందన్నారు. త్వరలో అత్యంత ఘనంగా తిరుపతిలో
భాషా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నామని తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర,
పల్నాడు, అనంతపురం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరంలలో తెలుగు మహాత్సవాలను
నిర్వహించి లబ్ధప్రతిష్టులను సత్కరించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు, శాసన సభ్యులు మల్లాది విష్ణు
మాట్లాడుతూ గిడుగు వేంకట రామమూర్తి తెలుగు భాషాభివృద్ధికి ఉద్యమ రూపంలో విశేష
కృషి చేశారని కొనియాడారు. తెలుగు భాషకు మరింత శోభ చేకూర్చే విధంగా, పూర్వ
వైభవం తీసుకువచ్చేందుకు నేటి తరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు
భాషకు ప్రాచీన హోదా తీసుకురావడంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి
ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు.
*ఈ సందర్భంగా సి. రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని
శ్రీనివాసరావు మాట్లాడుతూ వాడుక భాషకు పట్టం కట్టింది గిడుగు వేంకట రామమూర్తి
పంతులు అని అన్నారు. నేటి తరం ఒక్క భాషకు పరిమితం కాకుండా ఇతర భాషలపై కూడా
పట్టు సాధించాలని తెలుగు భాషను అభివృద్ధి చేసుకుంటూ ఇతర భాషలను సైతం
నేర్చుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పి. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గిడుగు వేంకట
రామమూర్తి చేసిన కృషి ఫలితమే గ్రాంథిక భాషలో ఉన్న పాఠ్య పుస్తకాలు వ్యవహారిక
భాషలో ముద్రణ అయ్యాయన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషా మహోత్సవాలు నిర్వహించాలన్న ఆకాంక్షను వ్యక్తం
చేశారు.
విజయవాడ నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వివిధ కావ్యనాయకుల పాత్రల
వేషధారణలతో హాజరై ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం ప్రదర్శించిన భువన
విజయం సభ ప్రదర్శన అలరించింది. ఈ వేడుకలకు గిడుగు రామమూర్తి పంతులు ముని మనవడు
గిడుగు వెంకట నాగేశ్వరరావు ప్రత్యేకంగా హజరయ్యారు. అనంతరం తెలుగు
భాషాభివృద్ధికి, సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన 49 మందికి
పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
ఢిల్లీరావు, నవరత్నాల అమలు కమిటీ ఛైర్మన్ నారాయణ మూర్తి, అధికార భాషా సంఘం
సభ్యులు పాల్గొన్నారు.