సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు
విజయవాడ : గిడుగు రామ్మూర్తి పంతులు “వాడుక భాషోద్యమం” ఆంధ్ర సారస్వత
వికాసానికి, విద్యా బోధనకు ఎంతగానో సహకరించిందని సి.ఆర్. మీడియా అకాడమీ
చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. గిడుగు జయంతి సందర్బంగా
స్థానిక సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయంలో “మీడియాలో వాడుక భాష” పై మంగళవారం
జరిగిన సదస్సు కు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రాంధికం
నుంచి వాడుక భాషలో బోధన తమ లాంటి ఏంతో మందికి చదువుకుని ఉన్నత స్థానాలకు
చేరుకునే అవకాశం కలిపించిందని ఆయన అన్నారు. వాడుక భాష పత్రికల వ్యాప్తికి,
తద్వారా సమకాలీన అంశాల పై సమాచారం ప్రజలకు చేరువైందని ఆయన పేర్కొన్నారు. మాతృ
భాషను ప్రోత్సహిస్తూనే పాఠశాల విద్య నుంచి ఇంగ్లీష్ ను ముఖ్య మంత్రి . జగన్
మోహన రెడ్డి ప్రవేశ పెట్టారని ఆయన తెలిపారు. ప్రపంచ భాష గా కొనసాగుతోన్న
ఇంగ్లీషు భాష నేర్చుకోవడం ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు మన పిల్లలు పోటీ
పడే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పిస్తున్నారన్నారు. దీని పై పలువురు చేస్తోన్న
వివాదస్పద వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలి ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు.
వాడుక భాష రూపంలో సరళమైన భావం ప్రజలకు అందించడం లో పత్రికలు కృషి చేయాలన్నారు.
తెలుగు భాష వాడకంలో కొన్ని పత్రికలు వింత పోకడలు పోవడం పట్ల ఆయన విచారం
వ్యక్తం చేశారు. ఫ్లై ఓవర్ ను “కొత్త పై వంతెన” అని రాయడం ద్వారా అయోమయానికి
పాఠకులను గురిచేయ వద్దని ఆయన సూచించారు.
వాడుక భాష వ్యాప్తితో తెలుగు సాహిత్యం వర్ధిల్లిందని, నాన్ రెసిడెంట్ తెలుగు
సొసైటీ అధ్యక్షులు మేడపాటి వెంకట్ అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు
నిలిచేవుంటుందన్నారు. మాతృ భాష తో పాటు ఆంగ్లం పై పట్టు సాధించి ప్రపంచ పోటీలో
పాల్గొనేందుకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యార్థులకు అవకాశం
కల్పించారని అన్నారు. దీనిపై వున్న అపోహలను విడనాడాలని ఆయన కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి. ఆర్ కృష్ణం రాజు
మాట్లాడుతూ బ్రిటిష్ పాఠశాలల తనిఖీ అధికారి “ఈట్స్” తమ పరిశీలనలో పండితుల భాష
లో బోధన వుండడం వల్ల విద్యార్ధులు నష్టపోతోన్న సంగతి గమనించారని, దీని
పరిష్కారానికి గిడుగు రామ్మూర్తి వారిని సంప్రదించారని తెలిపారు. అప్పటికే
వ్యావహారిక భాషోద్యమ బాట పట్టిన ‘గిడుగు’ ను సంప్రదాయ కవిత్వ వాదులు తీవ్రం గా
వ్యతిరేకించారని, అయినప్పటికీ ఆయన వెనుకంజ వేయలేదని ఆయన అన్నారు. తొలినాళ్లలో
పత్రికలూ గ్రాంధిక భాషనే ఆశ్రయించాయని, 1980 దశకంలో పత్రికలు కూడా వ్యవహారిక
భాషను అనుసరించాయన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ భండారు రాధా కృష్ణ మాట్లాడుతూ వ్యావహారిక భాష ఉద్యమం
ఫలితంగా ఆంద్ర సారస్వతం నవల, కథ, ఆధునిక కవిత్వం రూపంలో వర్ధిల్లిందని
అన్నారు. సీనియర్ జర్నలిస్టు, మీడియా అకాడమీ మాజీ సభ్యులు నిమ్మరాజు చలపతి
రావు మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవడంలో పత్రికలు ముందుండాలని పిలుపు
నిచ్చారు. సమకాలీన వార్తా విశేషాలను జన సామాన్యానికి చేరవేసే తెలుగు పత్రికల
పాఠకుల సంఖ్య తగ్గిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ, టి.వి.
దర్శకులు హృదయరాజ్ మాట్లాడుతూ, ప్రపంచంలోని “జ్ఞానం” గ్రంధాలనుంచి సామాన్యులకు
చేరాలనే తలంపుతో గిడుగు వారు వ్యావహారిక భాషను ప్రవేశ పెట్టినట్లు తాము
భావిస్తామన్నారు. లిపి వున్నపుడు మాత్రమే ఆదివాసీల భాషలు నిలుస్తాయనిఆయన
భావించి సవర భాష కు లిపిని కనిపెట్టారన్నారు. శ్రీశ్రీ అంతర్జాతీయ సంస్థ
అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ మాటలు, పాటలు, ప్రచార
సాధనాలు ద్వారా తెలుగు భాష వికాసానికి కృషి చేయాలని అన్నారు. తెలుగు సాంస్కృతి
ని ప్రతిబింబించే పలు సేవా కార్యక్రమాలను తమ ఏ. పి.ఎన్.ఆర్.టి తో కలిసి
నిర్వహించిన సంగతి ని గుర్తుచేశారు మలేషియా, దుబాయ్, థాయిలాండ్ వంటి దేశాల్లో
తెలుగు సంస్కృతిని ప్రోత్సహించే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
మీడియా అకాడమి సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర్ తిలక్ మాట్లాడుతూ వాడుక
భాషా ఉద్యమ నిర్మాతగా గిడుగు వారందించిన సేవలు అపూర్వ మని అన్నారు. సీనియర్
జర్నలిస్ట్ శ్రీ తాళ్లూరి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ప్రస్తుత తరానికి గిడుగు
వారి సేవలు తెలియచెప్పాలని సూచించారు. వ్యావహారిక భాషను పత్రికల్లో తాపీ ధర్మా
రావు ప్రవేశ పెట్టారన్నారు. ఈ కార్యక్రంలో భాషా కోవిదులైన డా.
టేకుమళ్లవెంకటప్పయ్య, కాళ్ళూరి వెంకట సుబ్బయ్య, అనంత హృదయ రాజ్, కత్తిమండ ప్ర
తాప్ కుమార్, అద్దంకి రాజా యోనా లను సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాస రావు సన్మానించారు.