అమరావతి : తెలుగు భాష ను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మాట్లాడే భాష
రాసే భాష ఒకటి కావాలని తపించి ఆ దిశగా వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపిన గిడుగు
వెంకట రామమూర్తి ని తెలుగు జాతి ఎన్నడూ మరువకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్
అన్నారు. మంగళవారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తికి
సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానన్నారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని
ప్రజల భాషలోకి తీసుకువచ్చి మన మాతృభాషకు జీవంపోశారని పవన్ కొనియాడారు. ఆంధ్ర
ప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదని, కాబట్టి ప్రజలే తెలుగు
భాషను కాపాడుకొనే బాధ్యతను స్వీకరించాలన్నారు. చిన్నారులు ఓనమాలు నేర్చుకొనే
దశ నుంచే మన మాతృ భాషను దూరం చేసే విధంగా ఉన్న పాలకుల తీరు వల్ల కలిగే
అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు.