కొవ్వూరు : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్హత ప్రామాణికంగా 100 శాతం సంక్షేమ
పథకాలు అందుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప
గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 129వ రోజు చాగల్లు మండలం చాగల్లులో
ఆమె మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ
వెళ్లి నాలుగేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న
పథకాలను ఆమె వివరించారు. జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు అందిస్తున్న
వంటకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులు బాగా చదువుకుని
ఉన్నత స్థానాలకు ఎదగాలని హోంమంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హోం మంత్రి
తానేటి వనిత మాట్లాడుతూ గడప గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ఒక్క జగనన్న
ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి ఏ
ఇంటికి వెళ్లినా ప్రజల్లో సంతోషమే కనపడుతోందన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుడు
జగనన్న ప్రభుత్వానికి తేడా వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కులం, మతం,
పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని
హోంమంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ స్థానిక
ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.