గుంటూరు : చదువులతో పేదరికాన్ని ఎదిరిద్దాం,ప్రతి ఇంట్లో విద్యా దీపాలు
వెలిగిద్దాం అన్న పవిత్ర లక్ష్యంతో రూపొందించిన “జగనన్న విద్యా దీవెన” పథకం
కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుండడంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటా
విద్యా దీపాలు వెలంగుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం ఆయన పలు
అంశాలపై స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యాదీవెన, వసతి దీవెన
కింద నాలుగేళ్లలో చేసిన ఖర్చు రూ. 15,600 కోట్లు చేసిందని, విద్యారంగంలో సమూల
మార్పుల కొరకు ఏకంగా 69,266 కోట్లు చేసిందని అన్నారు.
దొంగ ఓట్లు నమోదులో చంద్రబాబు వరల్డ్ ఛాంపియన్ : ఒలింపిక్స్ లో దొంగ ఓట్లు
నమోదు పోటీ ఉంటే చంద్రబాబే వరల్డ్ ఛాంపియన్ అని విజయసాయిరెడ్డి అన్నారు. ఓటర్ల
జాబితాలో చంద్రబాబు చేసిన దుర్మార్గాలన్నీ వైఎస్ఆర్ సీపీ సాక్ష్యాధారాలతో సహా
ఈసీకి వివరించిందని అన్నారు.
ఓటమికి సాకులు వెతుక్కుంటున్న టీడీపీ : 2024లో జరిగబోయే ఏపీ ఎన్నికల్లో ఓటమికి
టీడీపీ ఇప్పటి నుంచే సాకులు సిద్ధం చేస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. ఈరోజు
బోగస్ ఓటర్లపై కథలు అల్లారు, రేపు ఈవీఎంలను ట్యాంపరింగ్, ఆ తర్వాత లెక్కింపు
సమస్యలే అంటారు. మొదటి సంవత్సరం న్యాయవిద్యార్థి కూడా ఇవన్నీ భారత ఎన్నికల
కమిషన్ ఆదేశం కిందకు వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం కాదని చెప్పగలరని ఆయన
అన్నారు.