30 వ డివిజన్ 242 వ సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం
అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల వైపు
అడుగులు వేస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు తెలిపారు. 30 వ డివిజన్ 242 వ వార్డు సచివాలయ పరిధిలో మంగళవారం
జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో
కలిసి ఆయన పాల్గొన్నారు. రామకృష్ణాపురంలో విస్తృతంగా పర్యటించి 193 గడపలను
సందర్శించారు. పేదలకు నవరత్నాల కార్యక్రమాల ద్వారా చేకూరిన లబ్ధిని సంక్షేమ
బుక్ లెట్ల ద్వారా వివరించారు. అలాగే డాక్టర్లు, లాయర్లు, వర్తక
వ్యాపారస్తులతో మమేకమవుతూ ముందుకు సాగారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల
అభిప్రాయాలను తెలుసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను
ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని మల్లాది విష్ణు
అన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రజల ఇంటి వద్దకే వస్తుండటంతో సుధీర్ఘకాలం
స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. గత ప్రభుత్వంతో
పోలిస్తే, ఈ ప్రభుత్వంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడిందని.. ప్రతి వీధి
పరిశుభ్రంగా ఉంటున్నట్లు స్థానికులు చెప్పడం ఎంతో సంతోషాన్ని
కలిగించిందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మంచి చేస్తున్న ప్రభుత్వంపై ముప్పేట దాడి : రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్
రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల హృదయాలలో సుస్థిరంగా, చెరగని ముద్ర
వేసుకుంటున్నాయని మల్లాది విష్ణు అన్నారు. అది చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వంపై
ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. పేదలకు చేస్తున్న
మంచిని కూడా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పాలనలో పదేళ్లు వెనక్కి వెళ్లిన విజయవాడ నగరానికి.. వైఎస్
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కొత్త కళ వచ్చిందన్నారు. ప్రతీ
సచివాలయ పరిధిలోనూ అర్హులైన పేదలకు కోట్లాది రూపాయల సంక్షేమాన్ని
అందిస్తుండటంతో పాటు.. నగరంలోనూ రూ. వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు
శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. తమను గెలిపించిన ప్రజలకు చేసిన మంచిని
గడప గడపకు వెళ్లి తాము చెప్పగలమని.. టీడీపీ హయాంలో పేదలకు ఏం చేశారో చెప్పే
ధైర్యం గత పాలకులకు ఉందా..? అని సూటిగా ప్రశ్నించారు. సెల్ఫీలతో ప్రజలను
మభ్యపెట్టడం కాదని,దమ్ముంటే ప్రజాక్షేత్రంలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
దొంగ ఓట్ల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే : రాష్ట్రంలో దొంగ ఓట్ల పాపం
ముమ్మాటికీ చంద్రబాబుదేనని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. టీడీపీ
అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయని,
వీటిపై గతంలోనూ తాము పోరాడినట్లు గుర్తుచేశారు. అప్పట్లో ఈ అంశాన్ని కేంద్ర
ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని.. వైఎస్ జగన్ నాయకత్వంలో
ఎంపీలందరూ ఢిల్లీకి వెళ్లి పిటీషన్లు కూడా వేసినట్లు తెలిపారు. ఆనాడు
వ్యవస్ధల్ని మేనేజ్ చేసి బాబు చేసిన అక్రమాలు అన్నీఇన్నీ కావని.. ఒక్క
కుప్పంలోనే 30 – 40 వేల దొంగ ఓట్లు బయటపడ్డాయని మల్లాది విష్ణు ఆరోపించారు.
అటువంటిది మరలా ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ ను కలుస్తారని
ప్రశ్నించారు. టీడీపీ గతంలో చేసిన తప్పుల్ని తాము సరిచేస్తున్నట్లు ఎమ్మెల్యే
తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు, డబుల్ ఓట్లను తొలగిస్తుంటే చంద్రబాబుకి
ఎందుకంత ఉలికిపాటు..? అని పేర్కొన్నారు. ఓటమిని ముందుగా గ్రహించే వారి హయాంలో
నమోదు చేసిన దొంగ ఓట్లను కాపాడుకోవడానికి ప్రతిపక్షనేత ఇటువంటి డ్రామాలు
ఆడుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. చంద్రబాబు కుట్రలను సమర్థవంతంగా
తిప్పికొడతామని తెలియజేశారు. కార్యక్రమంలో డీఈ రామకృష్ణ, సీడీఓ జగదీశ్వరి,
నాయకులు మార్తి చంద్రమౌళి, వి.రమేష్, పవన్ కుమార్ రెడ్డి, గోపిశెట్టి శ్రీను,
నగర ప్రసాద్, ఎస్. రామకృష్ణ, డి.కృష్ణ, భోగాది మురళి, గోళ్ల శ్రీను, డి.
దుర్గారావు, సామంతకూరి దుర్గారావు, మస్తాన్ వలి, రాజు, వర్మ, రఫీ, బెజ్జం రవి,
అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.