వ్యవహారిక భాషకు గిడుగు నాంధి పలికితే గురజాడ వ్యవహారిక రచనలతో చైతన్య
పర్చారు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి
అమరావతి : శ్రీ గిడుగు వెంకట రామమూర్తి వ్యవహారికా భాష ఉద్యమం వల్లే విద్య
సరళీకృతం అయి, ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిందని ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి డా.కె.ఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. అంకిత భావంతో గిడుగు చేసిన
కృషి కారణంగానే గ్రాంథిక భాషలో నున్న పాఠ్య పుస్తకాలు వ్యవహారిక భాషలో ముద్రణ
అయ్యాయని, అందుకు తెలుగు వారు అంతా ఆయనకు ఎంతో రుణపడి ఉన్నారన్నారు. తెలుగు
వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి జయంతి
వారోత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో తెలుగు భాషా దినోత్సవ
వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం, తెలుగు
భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ మరియు రాష్ట్ర సచివాలయం ఉద్యోగ సంఘం సంయుక్తంగా
నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి
ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పలు ఉద్యమాలకు ప్రసిద్ది చెందిన శ్రీకాకుళం
జిల్లాలో జన్మించిన శ్రీ గిడుగు వెంకట రామమూర్తి వ్యవహారికా భాష ఉద్యమానికి
నాంధి పలికారన్నారు. ఆయన రోజుల్లో ప్రజలు మాట్లాడే వ్యవహారిక భాషలో కాకుండా
గ్రాంధిక భాషలోనే పాఠ్యపుస్తకాలు ఉండేవన్నారు. 1907 లో పాఠశాలల డిప్యూటీ
ఇన్స్పెక్టర్ అయిన ఒక బ్రిటీష్ అధికారి ఆ విషయాన్ని గుర్తించి పాఠ్యాంశాలు
కూడా వ్యవహారిక భాషలోనే ముద్రించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. ఈ విషయాన్ని
గ్రహించిన గిడుగు ఎంతో ఉత్సాహంగా వ్యవహారిక భాషా ఉద్యమాన్ని చేపట్టి విజయం
సాధించారన్నారు. ఫలితంగా చాలా మంది విద్యను అభ్యసించడం మొదలు పెట్టడంతో తెలుగు
భాష, సంస్కృతి ఎంతగానో ఫరిడవిల్లడం జరిగిందన్నారు. గిడుగు వ్యవహారిక భాషకు
నాంధి పలకడం వల్లే మహాకవి గురజాడ అప్పారావు కన్యాసుల్కం వంటి నాటకాలు, రచనలు,
కవితలు అన్నీ వ్యవహారిక భాషలో రచించి సమాజాన్ని ఎంతగానో చైతన్య పర్చారన్నారు.
గిడుగు వెంకట రామమూర్తి కృషి వల్లే సవర భాషకు నిఘంటువు, వ్యాకరణం రూపొందడం
జరిగిందని, అందుకు రావ్ భహదూర్ అనే బిరుదును బ్రిటీష్ ప్రభుత్వం అతనికి ఇవ్వడం
జరిగిందన్నారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని రాష్ట్ర సచివాలయంలో కూడా తెలుగును
విస్తృత స్థాయిలో అమలు పర్చాలని ఉద్యోగులకు ఆయన సూచించారు.
రాష్ట్ర తెలుగు అధికార భాషా
సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పి.విజయబాబు
మాట్లాడుతూ తమిళులు తమ మాతృభాషతో పాటు ఆంగ్లానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే
ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో తమిళులే ఎక్కువగా ఉంటున్నారన్నారు. ఆ సూక్ష్మాన్ని
గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని
ప్రోత్సహిస్తున్నారన్నారు. పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఆంగ్ల భాషను
ప్రోత్సహిస్తూనే నిత్య జీవితంలోను, పాలనా వ్యవహారాల్లోనూ తెలుగు భాషను
ప్రోత్సహించాలనే లక్ష్యంతో వారు ఉన్నారన్నారు. ఫలితంగా గిడుగు వెంకట
రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుండి 29 వ తేదీ వరకు వారం
రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన
తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్
రెడ్డి , అధ్యక్షుడు పి. విజయబాబు గిడుగు, శ్రీనాధుని వంశీకులతో పాటు
తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యంలో మంచి ప్రతిభ కనబర్చిన రాష్ట్ర సచివాలయ
ఉద్యోగులకు దుశ్శాలువా, జ్ఞాపికలను అందజేస్తూ సత్కరించారు. రాష్ట్ర సాంస్కృతి
శాఖ సి.ఇ.ఓ. మల్లికార్జున రావు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అద్యక్షుడు
కె.వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం సభ్యులు రామచంద్రా
రెడ్డి, కత్తి వెంకటేశ్వరరావు, మస్తానమ్మ, వెంకటయ్య, గిడుగు వంశీయుల్లో నాలుగో
తరం వ్యక్తి అయిన గిడుగు వెంకట నాగేశ్వరరావు, శ్రీనాధ కవిసార్వ భౌముని
వంశీయుల్లో 13 వ తరం వారైన కావూరి శ్రీనివాస శర్మ తదితరులతో పాటు సచివాలయ
ఉద్యోగులు పెద్ద ఎత్తను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.