విజయవాడ : ఓటర్ల జాబితాపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేదా
సుప్రీంకోర్టుకైనా వెళ్లొచ్చని ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్
అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు దేన్నైనా రాజకీయాలకు
వాడుకుంటారని, రాజకీయం చేస్తారని విమర్శించారు. ఆధార్ కార్డుతో ఓటరు కార్డుకు
లింక్ చేస్తున్నారన్నారు. టెక్నాలజీతో ప్రతి ఓటర్ ఐడీని ఆధార్ కార్డుకు లింక్
చేస్తున్నారని తెలిపారు. తనిఖీ అనంతరం ఒక్క బటన్‌తో నకిలీ ఓటర్లను డిలీట్ చేసే
వ్యవస్థ వచ్చిందన్నారు. ఉరవకొండలో జరిగినదాన్ని పెద్ద వ్యవహారంగా
చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట దొంగ ఓట్లు నమోదు చేసి
ఉండొచ్చని, అధికారులు వాటన్నింటినీ తనిఖీ చేసి తొలగిస్తున్నారని తెలిపారు.
దొంగ ఓట్లు చేర్పించాల్సి అవసరం తమకెవరికీ లేదని స్పష్టం చేశారు. ఎన్నికల
ముందు దొంగ ఓట్లు, ఎన్నికల తర్వాత ఈవీఎంలపై చంద్రబాబు ఆరోపణలు చేస్తారన్నారు.
వ్యవస్థలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఓటర్ల జాబితా అంతా పారదక్శకంగా
జరుగుతోందని తెలిపారు. ఓటర్ జాబితాలపై ఎవరు ఎక్కడికైనా వచ్చి చెక్
చేసుకోవచ్చన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ న్యాయం చేశామని మంత్రి తెలిపారు.