30 వ డివిజన్ 242 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ సెంట్రల్ : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం ఆర్థిక పరిపుష్టి
సాధించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్లానింగ్
బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ
డివిజన్ 242 వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్
జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. రామకృష్ణాపురం బుద్దంరాజు వీధిలో
విస్తృతంగా పర్యటించి 291 గడపలను సందర్శించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ
సంక్షేమ పథకాలు అమలు తీరును వివరిస్తూ ఏ ఇంటికి ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి
చేకూరిందో వివరించారు. కులం, ప్రాంతం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన
వారందరికీ ప్రభుత్వం సంక్షేమాన్ని అందజేస్తున్నట్లు మల్లాది విష్ణు
వెల్లడించారు. సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికి చేసి
ఆయా పథకాలను అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను మరింత
సమర్థవంతంగా అమలు చేసేందుకు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడమే
లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం
మీడియాతో మాట్లాడారు.
కనీవినీ ఎరుగని రీతిలో డివిజన్ అభివృద్ధి : గత తెలుగుదేశం పాలకులు డివిజన్
అభివృద్ధిపై కనీసం చిత్తశుద్ధి చూపలేదని మల్లాది విష్ణు విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని కళ్లకు
కట్టినట్లు చూపడం జరుగుతోందన్నారు. డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం నాలుగేళ్లలో
రూ. 23 కోట్లు వెచ్చించగా కేవలం రోడ్ల నిర్మాణానికే రూ. 9 కోట్లు
కేటాయించినట్లు చెప్పారు. రామకృష్ణాపురం నుంచి దేవీనగర్ వరకు ప్రధాన రహదారిని
పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. దేవీనగర్ రైల్వే
అండర్ పాస్ వద్ద రోడ్డు నిర్మాణం, యూజీడీ, వాటర్ లైన్ పనులకు రైల్వే డీఆర్ఎంను
అనుమతులు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని, వీలైనంత త్వరలో పనులు
ప్రారంభిస్తామని తెలియజేశారు. దేవీనగర్, దావుబుచ్చయ్య కాలనీ, ఉలవచారు కంపెనీ
మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు ప్రధాని రహదారి నిర్మాణ పనులు పురోగతిలో
ఉన్నట్లు వివరించారు. రూ. 80 లక్షల వ్యయంతో నిర్మించిన దేవీనగర్ అర్బన్ హెల్త్
సెంటర్ ను ఇటీవల ప్రారంభించుకున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ ప్రాంత
ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం గద్దె వెంకట్రామయ్య నగర్లో రూ.7.45 కోట్ల
వ్యయంతో చేపట్టిన 1,500KL రిజర్వాయర్ నిర్మాణం, పంపింగ్ మెయిన్ పైపులైన్ పనులు
సైతం శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో ఇటువంటి
అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టలేకపోయారో గత టీడీపీ పాలకులు సమాధానం చెప్పాలని
డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ
జగదీశ్వరి, నాయకులు మార్తి చంద్రమౌళి, గోపిశెట్టి శ్రీను, సామంతకూరి
దుర్గారావు, డి. దుర్గారావు, డి.కృష్ణ, టి.శివ ప్రసాద్, భోగాది మురళి, పవన్
కుమార్ రెడ్డి, శివ వర్మ, వి.రమేష్, బుజ్జి, ఈశ్వర్, రఫీ, వర్మ, నాగుల్ మీరా,
రాజు, ముత్యాలు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.