గుంటూరు :ఓటర్ల జాబితా యొక్క స్వచ్ఛతను నిర్ధారించే క్రమంలో ఎలక్టోరల్ రోల్
తయారీ, నిర్వహణ ప్రక్రియలో అవలంబించే విధానాలు, జాబితాలో పేర్లను చేర్చడం,
తొలగించడం, సవరించడం వంటి అంశాలు పారదర్శకంగా ఉండేలా ఎన్నికల సంఘం అన్ని
చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
తెలిపారు. ఆగస్టు 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్
అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా 2022 జనవరి 6
నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని తొలగింపులను తిరిగి సరిచూసుకోవాలని
ఆదేశించామన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారుల
ఆదేశాల మేరకు ఆగస్టు 9న రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం మెమో జారీ
చేసిందన్నారు.
నిర్దేశించిన 2022 జనవరి 6 నుండి అన్ని కేటగిరీలు అంటే పిఎస్ సి/ డిఎస్ ఇ,
డెత్, షిఫ్టింగ్ మొదలైన అన్ని తొలగింపులకు సంబంధించిన ఫిజికల్ ఫైల్ల పరిశీలన,
సరైన పత్రాలు నిర్వహించారా, నిర్దేశించిన విధానాన్ని నిర్ధారించడానికి క్రాస్
వెరిఫై చేయబడే అధికార పరిధి అటువంటి తొలగింపులలో ఎన్నికల కమిషన్ నియామావళిని
అనుసరించారా, లేదా వంటి అంశాలను లోతుగా విచారిస్తారని మీనా స్పష్టం చేసారు.
బిఎల్ ఓ లు అటువంటి అన్ని తొలగింపుల యొక్క వంద శాతం ఫీల్డ్ వెరిఫికేషన్‌ను
నిర్వహిస్తారని, ఇఆర్ఓలు అన్నిపత్రాల యొక్క వంద శాతం క్రాస్ వెరిఫికేషన్
చేస్తారన్నారు. తదుపరి కనీసం 1000 తొలగింపులను యాదృచ్ఛిక పద్ధతిలో ఫీల్డ్
వెరిఫై చేస్తారని సిఇఓ పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 500
తొలగింపులను రెండో సారి తనిఖీ చేయడానికి జిల్లాకు చెందిన సీనియర్ అధికారిని
ప్రత్యేక అధికారిగా నియమించాలని డిఇఓ లను ఆదేశించామన్నారు. నియోజకవర్గంలో
యాదృచ్ఛిక పద్ధతిలో కనీసం 100 తొలగింపులను జిల్లా ఎన్నికల అధికారి స్వయంగా
ఫీల్డ్ వెరిఫై చేస్తారన్నారు. ఈ మొత్తం ప్రక్రియను 2023 ఆగస్టు 30లోగా పూర్తి
చేయాలని ఆదేశించామన్నారు. ఈ క్రమంలో అన్ని తొలగింపుల రీవెరిఫికేషన్ ప్రక్రియ
పూర్తయిన తదుపరి, నివేదిక భారత ఎన్నికల కమిషన్‌కు పంపుతామని ముఖేష్ కుమార్
మీనా వివరించారు.