అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యంపై ఆర్థిక శాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌కు టీడీపీ సీనియర్ నేత, మాజీ
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. 2022 ఆడిట్ నివేదికలో కాగ్
లేవనెత్తిన అభ్యంతరాలను లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీ అనుమతి లేకుండారూ.
లక్ష కోట్లు అప్పు చేసినట్లు కాగ్ గణాంకాలతో సహా నిర్ధారించిందన్నారు. 2022
మార్చి నాటికే ప్రభుత్వ గ్యారెంటీల ద్వారా తీసుకున్న అప్పులు రూ. 1,18,003
కోట్లుగా కాగ్ తేల్చిందని లేఖలో పేర్కొన్నారు. కాగ్ నివేదికలో ప్రస్తావించిన
అంశాల ఆధారంగా ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులపై సర్కారు వాస్తవాలు చెప్పాలని
డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, కార్పొరేషన్ రుణాలతో కలిపి ఏపీ అప్పు
రూ.10 లక్షల కోట్లకు చేరిన వైనాన్ని వివరించారు. ఇంత అప్పు చేసినా మూలధన వ్యయం
దేశంలో సగటున 14 శాతం ఉంటే రాష్ట్రంలో 9 శాతం మాత్రమే ఉందన్నారు. ట్రెజరీతో
సంబంధం లేకుండా కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాల ఆధారంగా కేంద్రం నుంచి ఎక్కువ అప్పులకు
అనుమతి పొందిందని ఆరోపించారు. మితిమీరిన అప్పుల కారణంగా 2024 సంవత్సరంలో రూ.42
వేల కోట్లు అప్పులుగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని యనమల రామకృష్ణుడు
విమర్శించారు.