ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
రూ.16.93 కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జోనల్
కార్యాలయం ప్రారంభం
కర్నూలు : జనాభా పెరిగే కొద్దీ కాలుష్యం పెరిగిపోతోందని, కాలుష్య నియంత్రణ
చాలా అవసరమని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో రూ. 17 కోట్ల నిధులతో
(పోలుష్యన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన నిధులతో) ఈ భవనాన్ని నిర్మించామని,
తుంగభద్ర నీరు కాలుష్యం కాకుండా మంచి నీటి శుద్ధి ప్లాంటు కోసం కర్నూలు వన్
టౌన్ ప్రాంతానికి రూ. 82 కోట్ల రూపాయలతో ప్లాంట్ను ప్రారంభించామన్నారు.
కర్నూలు నగరానికి శాశ్వత త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ. 81
కోట్లలతో సుంకేసుల నుంచి ప్రత్యేక పైపు లైన్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి
బుగ్గన తెలిపారు. 2019లో శిథిలావస్థలో ఉన్న కర్నూలులోని సిల్వర్ జూబ్లీ
కళాశాలను 130 కోట్ల రూపాయలతో జగన్నాథ్ గట్టుపై నిర్మాణం చేపట్టామని, శ్రీ బాగ్
ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ మోహన్
రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా రోడ్ల నిర్మాణాలు
చేపట్టామని, కర్నూలుకు నాలుగు లైన్ల రోడ్లును నిర్మిస్తున్నామని చెప్పారు.
ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధి కోసం 9 వేల ఎకరాల భూమిని కేటాయించి,
పరిశ్రమలకు నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి బుగ్గన రాజేంద్ర
నాథ్ రెడ్డి తెలిపారు.
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ నందు 1213 చదరపు గజాల స్థలంలో రూ.16.93 కోట్ల
రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయం,
ప్రయోగశాల నూతన భవనాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్,
కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి,
కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రెటరీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ డాక్టర్
జి.సృజన కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్
ఎర్రబోతుల పాపిరెడ్డి,నగర మేయర్ బి.వై. రామయ్య,పాణ్యం ఎమ్మెల్యే కాటసాని
రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా,
తదితరులు పాల్గొన్నారు.