పోలవరం ప్రాజెక్ట్ ను 2025 జూన్ నాటికి పూర్తి చేస్తాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
అభివృద్ధి అంటూ 13 అభివృద్ధి శకటాల పేరుతో ప్రదర్శన
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మంగళవారం విజయవాడలో ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సాయుధ దళాలు గౌరవ వందనం
సమర్పించాయి. ప్రత్యేక వాహనంపై సీఎం పెరేడ్ ను పరిశీలించారు. సాయుధ దళాలు,
కంటింజెంట్లు కవాతు నిర్వహించాయి. అభివృద్ధి అంటూ 13 అభివృద్ధి శకటాల పేరుతో
ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ
రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్ట్
ను 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. గ్రామ స్వరాజ్యం అంటే
ఏమిటో 50 నెలల్లో చేసి చూపించానని జగన్ తెలిపారు. ఏ ప్రభుత్వం చేయని గొప్ప
మార్పులు చేశామన్నారు. ప్రధానంగా 6 రంగాల్లో వచ్చిన ప్రధానమైన మార్పులు అంటూ
ఒక్కో రంగంలో 10 అంశాలను ప్రస్తావించారు. వ్యవసాయం, విద్య, వైద్యం , మహిళ
సాధికారత, సామాజిక న్యాయం, పారిశ్రామిక రంగం లో వచ్చిన మార్పులు అంటూ జగన్
వివరించారు.
లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు : గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని
మార్పులు తెచ్చామన్నారు సీఎం జగన్. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు
మీదే ఇస్తున్నామన్నారు. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామని,
ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు
చెప్పారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం
తెచ్చామన్నారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదని,
అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నామని తెలిపారు.
శరవేగంగా పోలవరం పనులు : వ డివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయని సీఎం
తెలిపారు. 2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు.
వెలిగొండలో మొదటి టన్నెల్ పూర్తి చేశామని.. రెండో టన్నెల్ పనులు త్వరలోనే
పూర్తవుతాయని చెప్పారు. సామాజిక న్యాయం నినాదం కాదు, దాన్ని అమలు చేసి చూపామని
పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పిచినట్లు
చెప్పారు.
వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయం : అర్హులందరికీ పథకాలు అందించేందుకు
ప్రయత్నిస్తున్నట్లు సీఎం చెప్పారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా
అందిస్తున్నామని.. విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా
నిలుస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు
అందిస్తూ, రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని చెప్పారు.
వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని, కొత్తగా 13 జిల్లాలను
ఏర్పాటు చేశామని తెలిపారు.
98.5 శాతం వాగ్దానాల అమలు : పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకొచ్చామని
సీఎం జగన్ పేర్కొన్నారు. 98.5 శాతం వాగ్దానాలను అమలు చేశామన్నారు. పాల
వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశామని తెలిపారు. మూతపడిన
చిత్తూరు డైరీకి జీవం పోశామని అన్నారు. భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర
సర్వే చేపట్టామని చెప్పారు.