అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలి
అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ పై ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి సమీక్ష
గుంటూరు : విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ
పాఠశాలలు, ఇంటర్మీడియట్ విద్యలో ఐబీ సిలబస్‌పై సమావేశంలో చర్చించారు. ఈ
లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ స్థాయిలో
విద్యాబోధనే లక్ష్యంగా అడుగులు వేయాలని స్పష్టం చేసిన సీఎం జగన్ దీనికి
ముందుగా విస్తృతంగా అధ్యయనం, కసరత్తు చేయాలన్నారు. ఉన్నత విద్య టీచింగ్,
లెర్నింగ్‌లో ఏఐ వినియోగించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు.
అయితే, ఉన్నత విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై
కార్యాచరణను సీఎం వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా వివరించారు అధికారులు. ఉన్నత
విద్య విద్యార్థులకు కోర్సు చివరలో ఏఐ ప్రాథమిక అంశాలు బోధించే విధంగా
కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఏఐపై పరిశోధన కోసం యూనివర్శిటీల్లో సెంటర్
ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటు చేయనున్నారు. బోధన, పరిశోధన, మూల్యాంకనంలో ఏఐ
టూల్స్ వినియోగం ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారు.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ
ఫౌండేషన్ కోర్సు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బైలింగువల్,
డిజిటల్ కంటెంట్ రూపంలో కోర్సులు తీసుకురానున్నారు. ఏఐ, అప్లికేషన్ల
వినియోగంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అభివృద్ధి చేస్తారు.
యూనివర్శిటీలో మూడు రకాల జోన్లను అభివృద్ధి చేయనున్నారు. కంప్యూటర్ విజన్
జోన్, ఇమేజ్ ప్రాససింగ్ జోన్ మెటావర్స్ లెర్నింగ్ జోన్లు ఏర్పాటు
చేయనున్నారు.
విద్యారంగంలో అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ విస్తృత వినియోగం : విద్యా సంస్థల్లో
మెరుగైన ప్రమాణాలను పాటించడంతో పాటు అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా కృషి
చేయాలని, అందుకోసం అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీని విస్తృతస్థాయిలో
వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖను
ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ విద్యలో ఐబీ సిలబస్‌పై
సమావేశంలో ప్రముఖంగా చర్చ సాగింది. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని
అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ‘‘అర్టిఫీషియల్
ఇంటెలిజెన్సీలో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్ అకడమిక్
కమ్యూనిటీలో ప్రసిద్ధ సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి.
పైలట్ పద్ధతిలో వివిధ సంస్థల కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలి. ఏఐలో
క్రియేటర్లుగా మారడం ఎలా అన్నది మరొక ప్రధాన అంశం. అందుబాటులో ఉన్న ఏఐని
వాడుకుని దాన్ని బోధనలో, సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో
వినియోగించుకోవాలన్నారు. ఉన్న సబ్జెక్టులను మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి
కూడా ఏఐని వినియోగించుకోవాలి. కొత్త తరహా సబ్జెక్టులను నేర్చుకునేందుకూ ఏఐని
వినియోగించుకోవాలి. అధ్యాపకుల కొరత, కంటెంట్ల కొరతను నివారించడానికి ఏఐ
వినియోగపడుతుంది. పాఠశాల విద్యలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా
విధానాలు అందాలి. విద్యార్థుల ప్రయోజనాలు నెరవేర్చేలా, మన విద్యావ్యవస్థ
అవసరాలను, విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ అధ్యయనం చేయాలి. ఏపీలో
ఒక విద్యార్థి పదోతరగతి సర్టిఫికెట్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్
తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా విలువైందిగా ఉండాలన్నదే లక్ష్యం అని
సీఎం జగన్ విద్యాశాఖకు స్పష్టం చేశారు.
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్
ప్రకాష్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ
కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె
హేమచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఇంటర్ మీడియట్
ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరబ్ గౌర్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్,
పాఠశాల విద్యాశాఖ కమిషనర్(మౌలిక వసతులు కల్పన) కాటమనేని భాస్కర్,
సర్వశిక్షాఅభియాన్ ఎస్పీడీ బి శ్రీనివాసరావు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి
మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీ ఎన్ దీవాన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు
హాజరయ్యారు.