రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ లో మత్స్య సంపద వినియోగాన్ని పెంచేందుకు, అందుకు
అవసరమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృత పర్చాలనే లక్ష్యంతో
ముఖ్య నగరాల్లో మూడేసి రోజుల చొప్పున సీ ఫుడ్ ఫెస్టివల్స్ ను
నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్
తానేటి వనిత తెలిపారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించే 4వ సీ-ఫుడ్
ఫెస్టివల్ పోస్టర్ ను సోమవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి విడుదల
చేశారు. ఆగస్టు 25 నుండి 27వ తేదీ వరకు రాజమండ్రిలో ఈ ఫెస్టివల్ ఘనంగా
నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విజయవాడలోని స్ధానిక సంస్ధ
భూమి ఆర్గానిక్స్ సౌజన్యంతో ప్రభుత్వం ఈ ఫెస్టివల్ నిర్వహిస్తోందని ఆమె
వివరించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో రూ.699/- లతో అపరిమితమైన సీ ఫుడ్ బఫెట్ ను
ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు హోంమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో
స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తూర్పుగోదావరి జిల్లా మత్స్యశాఖ జేడీ వి.
కృష్ణా రావు, ఏడీ షేక్ దిల్షాద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.