“డయా ఫ్రమ్ వాల్” దెబ్బతింది
నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది
సీనియర్ పాత్రికేయుడు సుంకు విశ్వేశ్వరరావు
విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో భాగమైన “అప్పర్ కాఫర్ డామ్” పనులు
పూర్తికాకుండా “డయా ఫ్రమ్ వాల్” నిర్మించడం వల్ల 2019 అక్టోబర్ నెలలో
సంభవించిన వరదల వల్ల “డయా ఫ్రమ్ వాల్” దెబ్బతిన్నదని ఈ అంశానికి ప్రస్తుత
ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదని సీనియర్ పాత్రికేయుడు సుంకు
విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. ఇటీవలే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్
(ఎన్.హెచ్. పి. సి.) ఇచ్చిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని ఆయన
జర్నలిజం విద్యార్థులకు తెలిపారు. 2019 మే నెలలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం
అక్టోబర్ నెలలో వరదల తీవ్రత (22లక్షల క్యూసెక్ ల వరద ప్రవాహం) నుఎదుర్కొందని,
అంతకు ముందే “అప్పర్ కాఫర్ డామ్” పూర్తయ్యి వుంటే “డయా ఫ్రమ్ వాల్”
దెబ్బతినే అవకాశమే లేదన్నారు.
ఏ ప్రాజెక్ట్ నిర్మాణం లోనైనా “వర్క్ స్పేస్” ఏర్పాటు చేసుకుని ఒక్క చుక్క
నీరు రాకుండా కట్టడి చేసుకుని అక్కడ ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన
సామాగ్రి, పనులు కొనసాగించడంజరుగుతుంటుందని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్
నిర్మాణ ప్రదేశం లో గోదావరి నది గర్భంలో 300 మీటర్ల లోతువరకు ఇసుక పొరలు
విస్తరించి ఉన్నందువల్ల ఈ “వర్క్ స్పేస్” ఏర్పాటుకోసం నది ప్రవాహం పై భాగంలో
“అప్పర్ కాఫర్ డామ్”, దిగువ భాగంలో “లోయర్ కాఫర్ డామ్” నిర్మించి 420 ఎకరాల
మేర గోదావరి నది లో “వర్క్ స్పేస్” ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని
తెలిపారు. నది ప్రవాహంలో వున్న నీటిని మళ్లించేందుకు ఒక కిలోమీటర్ వెడల్పు, 6
కిలో మీటర్ల పొడవు కలిగిన కాలువను త్రవ్వి దీనికి అనుబంధంగా స్పిల్ వే
నిర్మించడం జరిగిందని చెప్పారు. అయితే, నీటిని మళ్లించినా, “అప్పర్ కాఫర్
డామ్” పూర్తి చేయక పోవడం వల్ల, ఆనాటి వరద ప్రవాహం వల్ల “డయా ఫ్రమ్ వాల్”
దెబ్బ తిన్నదని ఆయన తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ లో చాలా విశిష్టతలున్నాయని, ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా
ప్రాజెక్ట్ నిర్మాణానికి నదీ ప్రవాహాన్ని 6 కిలోమీటర్ల మేర కుడి వైపుకు
మళ్లించడం జరిగిందని తెలిపారు. నది మధ్య భాగంలో ‘ఎర్త్ కం రాక్ ఫిల్ డామ్’
నిర్మించడానికి అవసరమైన పునాది ఈ డయాఫ్రమ్ వాల్ అని ఆయన వివరించారు. సుమారు
50 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం కలిగిన గోదావరి నదికి దిగువ 300 మీటర్ల
మేర లోతు వరకు ఇసుక మేటలు విస్తరించి వుండడం వల్ల అంత లోతు వరకు పునాది గా
భావించే “డయా ఫ్రమ్ వాల్” ను నిర్మించాల్సి వుందన్నారు. గోదావరి నీటి
ప్రవాహాన్ని మళ్లించకుండా ఇది సాధ్యం కాదని, అందుకే నది ప్రవాహాన్ని
కుడివైపుకు 6 కి.మీ. మేర మళ్లించాల్సి వొచ్చిందన్నారు. అక్కడ “స్పిల్ వే ”
నిర్మాణం పూర్తిచేసి హైడ్రాలిక్ పద్దతిలో 48 రేడియల్ గేట్లు నిర్మించడం
జరిగిందన్నారు.అలా కాకుండా ప్రాజెక్ట్ నిర్మిస్తే, 300 మీటర్ల లోతువరకు వున్న
ఇసుక పొరలు వల్ల వరదల సమయం లో ప్రాజెక్ట్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ఆయన
తెలిపారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ లో “స్పిల్ వే”, “అప్పర్ కాఫర్
డామ్”,”లోయర్ కాఫర్ డామ్” పనులు పూర్తయ్యాయని, పవర్ హౌస్ పనులు చాలా వేగంగా
జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే, “డయా ఫ్రమ్ వాల్” నిర్మించి,
దానిపైభాగంలో’ఎర్త్ కం రాక్ ఫిల్ డామ్’ పనులు పూర్తి చేస్తే పోలవరం ప్రాజెక్ట్
పూర్తవుతుందని ఆయన తెలిపారు. కొట్టుకు పోయిన “డయా ఫ్రమ్ వాల్” పూర్తిగా
కొత్తగా నిర్మించాలా లేక దెబ్బతిన్నచోట సమాంతరంగా నిర్మించాలా అనే అంశం పై
నిర్ణయం వెలువడిన తరువాత సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డిజైన్ల మేరకు
టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాల్సివుంటుందని ఆయన తెలిపారు.