రాజకీయాల్లో మళ్లీ వేగం పెంచుతున్న విజయసాయిరెడ్డి
ఉదయమో చోద్యం, సాయంత్రమో వింత అనేది బాబు నైజం
ఖరీదైన దుష్ప్రచార క్యాంపెయిన్ మొదలు పెట్టించారు
ట్విట్టర్ లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
అమరావతి : కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలంటే వైసీపీ మద్దతుతోనే సాధ్యం అని
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈసారి ఢిల్లీ అధికారానికి
మార్గం ఏపీ గుండానే వెళ్తుందని అన్నారు. ఏపీలో ప్రజల ఆశీర్వాదాలు కేవలం
వైసీపీకి మాత్రమే ఉన్నాయని తెలిపారు. జాతీయ మీడియాతో పాటు, ఇప్పటి వరకు జరిగిన
అన్ని సర్వేలు వైసీపీ మరోసారి ఘన విజయం సాధించబోతోందని చెప్పాయని అన్నారు. దేశ
వ్యాప్తంగా అప్పుడే సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో
మరోసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉంది.
బీజేపీని గద్దె దింపాలనే పట్టుదలతో విపక్షాలు కలసికట్టుగా ముందుకు సాగేందుకు
ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా సోమ, మంగళ బెంగళూరులో విపక్షాల
నేతలు సమావేశమవుతున్నారు. మరోవైపు మంగళవారం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతలతో
బీజేపీ సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్
కల్యాణ్ కూడా హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ రాజ్యసభ సభ్యుడు
విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
చంద్రబాబుకు ఇదే ఆఖరి పోరాటం: చాలా రోజుల పాటు మౌనంగా ఉన్న వైసీపీ రాజ్యసభ
సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర
పడుతున్న తరుణంలో ఆయన మళ్లీ వేగం పెంచుతున్నారు. ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉదయమో చోద్యం,
సాయంత్రమో వింత అనే బాబుగారి నైజం ప్రజల్ని ఎమోషన్, కామెడీ, సెంటిమెంటు,
విషాదంలో ముంచెత్తుతున్నాయని ఆయన అన్నారు. ఏకపత్నీవ్రతుడైన రాముని ఇల్లాలు
సీతమ్మ వారి ప్రస్తావనను కూడా తెస్తున్నారని, పోలికకు కూడా ఒక హద్దు ఉండాలని
చెప్పారు. బాబుగారికి ఇది ఆఖరి పోరాటం కాబట్టే ఖరీదైన దుష్ప్రచార క్యాంపెయిన్
మొదలు పెట్టించారు కాబోలు అని ఎద్దేవా చేశారు.