ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్
కుమార్ నిరసన దీక్ష
తుళ్లూరులో ఉద్రిక్తత.. శ్రావణ్ కుమార్ అరెస్టు
జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌నూ అరెస్టు చేసిన
పోలీసులు
గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు
పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీక్షా శిబిరం వద్ద
పోలీసులు వందల సంఖ్యలో మోహరించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ రైతులను
పోలీసులు అరెస్టు చేశారు. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా టీడీపీ
అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. అదే సమయంలో
ఆర్-5 జోన్‌కి మద్దతుగా వైసీపీ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ చేయాలని
నిర్ణయించారు. ఈ క్రమంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే అనుమానంతో పోలీసులు
తుళ్లూరులో ముందస్తుగానే 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. అక్కడ
అమరావతి రైతుల తుళ్లూరు దీక్షా శిబిరాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి
తీసుకున్నారు. అయినప్పటికీ ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరులో టీడీపీ
ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. అప్పటికే దీక్షా శిబిరం వద్ద
పోలీసులు వందల సంఖ్యలో మోహరించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ రైతులను
పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు వారిని
లాగి పడేశారు. అక్కడికి వచ్చిన హైకోర్టు సీనియర్ న్యాయవాది, జై భీమ్ భారత్
పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో
దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా దీక్ష చేపడుతుంటే
ఈ అడ్డంకులేంటని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. అరెస్టు చేసిన రైతులు,
మహిళలను బలవంతంగా వాహనాలు ఎక్కించి తుళ్లూరు పీఎస్‌కు తరలించారు. దీక్షా
శిబిరంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రోజువారీ
నిరసనలకు కూడా అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. అక్కడికి ఎవరొచ్చినా
బలవంతంగా అరెస్టు చేస్తామని తేల్చి చెబుతున్నారు. మరోవైపు తుళ్లూరు మండలంలో
టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
తుళ్లూరులో ఉద్రిక్తత.. శ్రావణ్ కుమార్ అరెస్టు : అమరావతిలో టెన్షన్ వాతావరణం
నెలకొంది. తుళ్లూరులో 48 గంటల దీక్షకు జడ శ్రావణ్ కుమార్ పిలుపు ఇచ్చారు.
అయితే దీక్షకు వచ్చిన శ్రావణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రావణ్ నివాసం, కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అక్కడకు ఎవరినీ
అనుమతించలేదు. రోడ్డుపైకి వచ్చినవాళ్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే
జై భీం భారతి పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను అంబేద్కర్ విగ్రహం
వద్ద అరెస్టు చేశారు. కాగా శ్రావణ్ కుమార్ దీక్షకు మద్దతుగా రాజధాని రైతులు
వచ్చారు. బుధవారం శిబిరం నిర్వహించ వద్దంటూ రైతులకు పోలీసులు ఆదేశించారు.
తుళ్లూరు మెయిన్ బజారులో ఎవ్వరూ ఉండొద్దని, వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో
ఊళ్ళో ఎవరూ తిరగొద్దు అంటూ ముందుగా మైకులో చెప్పాలని, అప్పుడు ఎవ్వరూ ఉండరని
రైతులు పోలీసులతో ఉన్నారు. రోడ్‌పైన, ఇంటి ముందు కూర్చున్న గ్రామస్తులను
లోపలకు వెళ్లిపోవాలని పోలీసులు కోరుతున్నారు. గ్రామస్తులు మాత్రం ససేమిరా
అంటున్నారు. పోలీసుల ఆదేశాలపై మహిళా రైతులు మండిపడుతున్నారు. ఈ సందర్బంగా వారు
మాట్లాడుతూ తుళ్లూరులో 144 సెక్షన్ పెడుతున్నారని, తాము ఏం చేశామని 144
సెక్షన్ పెడుతున్నారని ప్రశ్నించారు. తాము రాజధాని కోసం భూములు ఇచ్చిన
పాపానికి అమరావతిలో పాకిస్తాన్ బోర్డర్ కంటే అన్యాయంగా ఉందని, రాజధాని
ప్రాంతంలో అంతా అరాచకంగా ఉందని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల
నుంచి రైతులపై పోలీసులు దమనకాండ సాగిస్తున్నారని, ఇక్కడ తమ ప్రైవేట్ స్థలంలో
శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఖాళీ చేయాలని పోలీసులు చెప్పడం ఏంటని మహిళా
రైతులు ప్రశ్నించారు.