సారవకోట : ప్రజల ప్రగతికి పటిష్టమైన పునాదులు వేసి సంక్షేమాన్ని అందిస్తున్న
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చరిత్ర సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన
కృష్ణదాస్ అన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం సారవకోట మండలం అలుదు పంచాయతీ
మాకివలస నుంచి జలుమూరు మండలం నగిరికటకం వరకు 10.5కి.మీ పొడవున రూ.10 కోట్లు
నాబార్డ్ నిధులతో నిర్మాణం చేపట్టిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతృత్వాన ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు
అవుతోందన్నారు. ఈ నాలుగేళ్ల ముందు, తర్వాత పరిపాలనలో మార్పులు చూడండి. జగన్
లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత మంచి జరిగిందో చూడండని అన్నారు. మీ గ్రామంలో
జరిగిన మార్పులు చూడండని చెప్పారు. జగన్ తన పాదయాత్రలో భాగంగా మన
దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పారో అవన్నీ చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం
ఇస్తున్నారన్నారు. హామీల నెరవేర్చడాని జగన్ నిరంతరం కృషి చేస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ వెనుకడుగు వెయ్యరు. మీరు హాయిగా బ్రతికేందుకు,
సమాజంలో మీ స్థాయి పెంచేందుకు కృషి చేసిన, చేస్తున్న ఈ ప్రభుత్వానికి మరోసారి
మీరు అండగా ఉండాలి అని కోరారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ సభ్యులకు లంచం
ఇవ్వకుండా ఏ పనీ జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
నిష్పక్షపాతంగా పథకాలు అర్హులైన అందరికీ అందుతున్నాయన్నారు.
సీఎం జగన్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్నారన్నారు. నయా పైసా ఖర్చు
లేకుండా,అవినీతి లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జగన్ పాలన
అందిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో వలంటీర్లు సేవలు అభినందనీయమన్నారు.
అందుకే వలంటీరుకు వందనం పేరిట ప్రభుత్వం తరుపున వారికి సన్మానం
చేస్తున్నామన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు చేరుకునే క్రమంలో నిరంతరం
పరిశ్రమిస్తున్న మిగిలిన వారందరికీ కూడా అభినందనలని అన్నారు. అనంతరం సారవకోట
మండలం కిన్నెరవాడ సచివాలయం పరిధి తొగిరి లో గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో పాల్గొన్నారు.