బాల్య వివాహాల నిర్మూలనకు సచివాలయ, అంగన్వాడీ, మహిళా పోలీసులతో కార్యక్రమాలు
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు
విజయవాడ : రాష్ట్రంలో నిర్వహించబడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్
పాఠశాలలు, కళాశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని బాలల
హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. ఈ మేరకు
మంగళగిరిలోని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కార్యాలయంలో మంగళవారం కమిషన్
సభ్యులు, సిబ్బందితో కలిసి ఆయన బాలల సమస్యలు, చేపట్టవలసిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ అప్పారావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలు కార్పొరేట్ విద్యా
సంస్థల తీరుపై విమర్శలు వస్తున్నాయన్నారు. అధిక ఫీజులు, సెలవుల్లో తరగతులు
నిర్వహణ, ఆత్మహత్యలు, వేధింపులు, శారీరక దండనలు వంటి మొదలగు బాలలు సమస్యలు
బాలల కమిషన్ దృష్టికి వస్తున్నాయని చెప్పారు. ఇందులోభాగంగా వీటిపై రాష్ట్ర,
జిల్లా, మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడం
జరిగిందన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం నిరుపేద కుటుంబంలో విద్యను
అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని, దీనిపై కూడా సంబంధిత
అధికారులు పరిశీలన చేయాలని సూచించారు. బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో
నిర్మూలించడానికి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగాన్ని
సమన్వయం చేశామన్నారు. గ్రామ,వార్డు సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది,
మహిళా పోలీసులు సమన్వయంతో పలు కార్యక్రమాలను రూపొందించడం జరుగుతోందని
తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో బాలకార్మికుల నిర్మూలనకు
జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను
తయారు చేసి అమలు చేస్తామని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి
అప్పారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు జంగం రాజేంద్ర
ప్రసాద్, గోండు సీతారాం, ఆదిలక్ష్మీ, బత్తుల పద్మావతి, ఎం.లక్ష్మీ దేవి,
మెంబర్ సెక్రెటరీ టి.వి.శ్రీనివాస్ పాల్గొన్నారు.