నాలుగేళ్లలో బీసీలను ఏం ఉద్దరించారు
బీసీ జనగణనతోనే బీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం
జోన్-3 బీసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
గుంటూరు : రాష్ట్రంలో సామాజిక న్యాయం ముసుగులో సామాజిక విద్రోహానికి
పాల్పడుతున్నారని నాలుగు సంవత్సరాల పాలనంతా బీసీలను అణగదొక్కడం, అక్రమ
కేసులు పెట్టడం, హత్యలు చేయడం దిశగానే సాగిందని, రిజర్వేషన్లు కుదించి, సబ్
ప్లాన్ నిధులు దారి మళ్లించి, కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి, విద్యా పథకాలు,
ఉద్యోగ అవకాశాలు నాశనం చేసి బీసీల బతుకుల్ని బుగ్గిపాలు చేశారని రౌండ్ టేబుల్
సమావేశానికి హాజరైన అఖిలపక్ష నాయకులు, కుల సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ
మేరకు గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర
అధ్యక్షుడు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ సాధికార సమితి
ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, తెలుగుదేశం పార్టీ గుంటూరు
పార్లమెంటు అధ్యక్షులు వేముల కొండ శ్రీనివాస్ అధ్యక్షతన జోన్-3 అఖిలపక్ష రౌండ్
టేబుల్ సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వెనుకబడిన తరగతులుగా గుర్తించబడ్డ వారికి ప్రోత్సాహం
అందించాలని ఎవరైనా చూస్తారు. కానీ జగన్ రెడ్డి మాత్రం వారి నుండి ఎంత వరకు
వీలైతే అంత వరకూ లాక్కుందాం. వారిని అణిచివేద్దాం అనేలా వ్యవహరిస్తున్నాడు.
ఎన్టీఆర్, చంద్రబాబు, సహా ఎంతో మంది ముఖ్యమంత్రులు స్థానిక సంస్థల్లో
రిజర్వేషన్లు కొనసాగిస్తే రద్దు చేశాడు. ఫెడరేషన్లు ఏర్పాటు చేశాం.
కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. వాటికి బడ్జెట్ ఇచ్చాం. రుణాలిచ్చి స్వయం ఉపాధి
కల్పించాం. ఈ విషయంలో ఆరోపణలు చేయడం తప్ప చర్చకు రమ్మంటే మాత్రం రావడం లేదు.
అధికారంలోకి వచ్చాక 56 కార్పొరేషన్లు పెట్టారు. సంతోషం, ఆ కార్పొరేషన్ల ద్వారా
ఎంత ఖర్చు చేశారో కూడా చెబితే ఇంకా సంతోషంగా ఉండేది. టీడీపీ హయాంలో
కార్పొరేషన్లకు ఇచ్చిన నిధుల్లో బ్యాంకుల వద్ద ఉన్న సొమ్మును కూడా లాక్కుని,
కార్పొరేషన్లను ఉత్సవ విగ్రహాలను చేశాడు. ఆదరణతో పరికరాలిస్తే, జగన్ రెడ్డి
వాటిని పంచకుండా తుప్పు పట్టిస్తున్నాడు. రాష్ట్రంలో బీసీల్లోని అన్ని కులాల
నుండి నాయకత్వాన్ని పెంచే లక్ష్యంతో చంద్రబాబు సాధికార సమితుల్ని ఏర్పాటు
చేశారు. బీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సాధికార సమితులు పని
చేయాలి. 55 శాతం జనాభా ఉన్న బీసీలు బలహీనులు ఎలా అవుతారో ఆలోచించుకోవాలన్నారు.
బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చదువుతోనే
బీసీలు అభివృద్ధి చెందుతారని గుర్తించిన చంద్రబాబు నియోజకవర్గానికి ఒక
రెసిడెన్షియల్ స్కూల్ కట్టించారు. మత్స్యకారుల్ని చదివించేందుకు ప్రత్యేకంగా
స్కూల్స్ కట్టించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తో కార్పొరేట్ విద్య
అందించారు. స్కిల్ డెవలప్మెంట్, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య ఇలా
చెప్పుకుంటూ పోతే బీసీలను విద్యావంతుల్ని చేయడానికి చంద్రన్న తాపత్రయపడ్డారు.
కానీ నేడు జగన్ రెడ్డి చదువులు దూరం చేసి ఉద్దరించానంటూ ప్రచారం
చేసుకుంటున్నాడు. టీడీపీ హయాంలో చేపట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్, కమ్యూనిటీ
హాల్స్ నిర్మాణాలు పూర్తి చేయకుండా పాడుబెడుతున్నాడు. ఆదరణ పథకాన్ని రద్దు
చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తుల వారికి ఇచ్చే సబ్సిడీలకు కూడా
మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా బీసీలను దగా చేస్తున్నాడు. మెగా డీఎస్సీ
అన్నాడు నాలుగేళ్లలో ఉన్న టీచర్ పోస్టులు పీకేస్తున్నాడు. 2.30 లక్షల ఉద్యోగాల
హామీకి తూట్లు పొడిచి 60 వేల మంది బీసీ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా
చేశాడు. ఇలాంటి వ్యక్తి మళ్లీ నాదే అధికారం అంటూ బీసీలను రాష్ట్ర
ప్రజానీకాన్ని మోసం చేసేందుకు సిద్ధపడడం సిగ్గుచేటు. పొలిట్ బ్యూరో సభ్యులు
యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉన్నపుడే ఏదైనా సాధించగలమనేది మనం
గుర్తించాలి. దశాబ్దాలుగా కుల గణన చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ మనం
సాధించుకోలేకపోతున్నాం. కుల గణన జరిగితే జనాభా దమాషా ప్రకారం నిధులివ్వాలి,
చట్ట సభలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. అందుకే కుల గణన జరపాలని
తెలుగుదేశం 2014లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అప్పుడెప్పుడో
ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్ల కారణంగానే నేడు పంచాయతీల
నుండి పార్లమెంటు వరకు నాయకత్వం ఏర్పడింది. అలా బీసీ నాయకత్వ పెరగకుండా
చేసేందుకే రిజర్వేషన్లు కుదించాడు. బీసీలు కలిసి ఉంటే తన ఆటలు సాగవని
విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. బీసీలు దేహీ అని తన ముందు దేబురించేలా
చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. బీసీలు ఎవరినీ ద్వేషించరు.. ఎవర్నీ దేహీ అని
అడుక్కోరని తెలుసుకోవాలి. మనకు రావాల్సినవి, కావాల్సినవి డిమాండ్ చేసి
సాధించుకుందామన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, టీడీపీ
సీనియర్ నేత నాగుల్ మీరా మాట్లాడుతూ మన జనాభా ఎంత ఉంది? మనకి ఇచ్చే నిధులెంత?
మన సమస్యలు ఏమిటి? అనేవి గుర్తించి, వాటి పరిష్కారం దిశగా అడుగులు వేసినపుడే
బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ముందుకు వెళతారు. మన నిధులు
సాధించుకుందాం. జీవితాలు బాగు చేసుకుందాం. కుల వృత్తుల్ని నమ్ముకున్న వారు
అలాగే ఉండిపోయారు. ఆస్తుల్ని నమ్ముకున్న వారే ప్రస్తుతం మెరుగైన స్థానాల్లో
ఉన్నారు. మనం కూడా వారిలా మెరుగైన స్థానానికి ఎదిగేలా పాటు పడే ఏకైక పార్టీ
తెలుగుదేశం పార్టీ అన్నారు. శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు మాట్లాడుతూ
రాష్ట్రంలో సగానికి పైగా జనాభా ఉన్న బీసీలు ఇంకా వెనుకబడి ఉండడానికి మనలో
ఐక్యత లేమి ప్రధాన కారణం. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్తే కొండనైనా పిండి
చేయగల సత్తా మనకి ఉంది. కానీ దశాబ్దాలుగా ఇంకా వెనుకబడి ఉన్నాం. వెనుకబాటుకు
గురవుతూనే ఉన్నాం. దీనికి శాశ్వత పరిష్కారం వెతుక్కునే దిశగా రాష్ట్రంలోని
బీసీలందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది అని పేర్కొన్నారు.