గుంటూరు : గడిచిన నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య రంగంలో
విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాజ్యసభ సభ్యులు,
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు
ట్విట్టర్ వేదికగా ఆదివారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్
విధానం అమలు చేసి గ్రామీణుల ముంగిటకే వైద్య సేవలు అందించారని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి ప్రజలకు
నిరంతర సేవలందించే విధంగా చేశారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ
ఆసుపత్రుల్లో 48 వేలకు పైగా పోస్టులు భర్తీ చేశారని అన్నారు. 16 వేల కోట్లతో
వైద్య సదుపాయాలు కల్పించి, 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వం
సరికొత్త చరిత్ర సృష్టించిందని అన్నారు.
హజ్ యాత్రికులకు ప్రభుత్వ సహకారం
హజ్ యాత్రకు వెళ్ళే ముస్లిం సోదరులకు జగన్ ప్రభుత్వం అండగా నిలిచిందని
విజయసాయి రెడ్డి అన్నారు. హజ్ యాత్రికుల పై అదనపు భారాన్ని ప్రభుత్వమే
భరిస్తున్నందుకు ముస్లిం నాయకులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి
ధన్యవాదములు తెలిపారని అన్నారు. హజ్ యాత్రికులకు రూ. 14.51 కోట్లు ఆర్థిక
సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ లో రూ 51.40
కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అలాగే గుంటూరులో ఉర్దూ
యూనివర్సిటీ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 175 మదర్సాల్లో టీచర్ల
నియామకం చేస్తున్నట్లు తెలిపారు.
లక్ష కోట్లు దాటిన డిఫెన్స్ ఉత్పత్తులు
ఇండియాలో రక్షణ రంగ సంబంధిత ఉత్పత్తి లక్ష కోట్లు దాటిందని, చరిత్రలో మొదటి
సారి ఈ ఘనత సాధించామని విజయసాయి రెడ్డి అన్నారు. 2022-23 లో
డిఫెన్స్ ఉత్పత్తులు 1.07 లక్షల కోట్లకు చేరుకోనుందని అన్నారు. 2021-22 లో
95000 కోట్ల ఉత్పత్తి కంటే ఇది 12% అదనం అని అన్నారు.
దేశంలో తగ్గిన టెర్రరిస్టు దాడులు
మే 22 మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా టెర్రరిస్టు వ్యతిరేక దినం
పాటిస్తున్న తరుణంలో దేశంలో టెర్రరిస్టు దాడులు గణనీయంగా తగ్గిన విషయాన్ని
ప్రతి ఒక్కరూ గమనించాలని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ గొప్పతనం కేంద్ర
హోంమంత్రి అమిత్ షా కు దక్కుతుందని ఆయన అన్నారు.