ఫ్యామిలీ డాక్టర్ విధానంలో….గ్రామీణుల ముంగిటకు వైద్య సేవలు
ప్రభుత్వాస్పత్రుల్లో గతంతో పోలిస్తే పెరిగిన వైద్యులు, సిబ్బంది
2019 నుంచి 48 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం
డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు మించి అందుబాటులో వైద్యులు, సిబ్బంది
రూ.16 వేల కోట్లతో నాడు–నేడు కింద వైద్య సదుపాయాల కల్పన
17 వైద్య కళాశాలల ఏర్పాటుతో కొత్త చరిత్ర
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాలతో పేదలకు కొండంత అండ
ఏకంగా 3,255 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం
నాలుగేళ్లలోనే రూ.8,302 కోట్లు ఖర్చు చేసిన సీఎం జగన్ ప్రభుత్వం
గుంటూరు : దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా, దేశంలోనే అన్ని
రాష్ట్రాలకంటే గొప్పగా వైద్య, ఆరోగ్య రంగంపై శ్రద్ధ చూపుతోంది. అవసరమైన మేరకు
వైద్యులు, సిబ్బంది, కొత్త వైద్య, నర్సింగ్ కళాశాలల ఏర్పాటు, నాడు–నేడు కింద
మౌలిక వసతుల కల్పన, కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తోంది. మన ఇంట్లో
వారికే బాగోలేకపోతే ఎలాంటి వైద్యం కోరుకుంటామో అచ్చంగా అలాంటి వైద్యాన్నే
ప్రజల ముంగిటకు తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలన్నీ శభాష్ అనేలా విప్లవాత్మక
సంస్కరణలతో ఈ రంగం ముఖ చిత్రాన్నే మార్చివేసింది. ఊరూరా వైద్య సేవలందించేలా
ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కల్పించడానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా
సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం చిన్న చిన్న జబ్బులకు పీహెచ్సీ, సీహెచ్‌సీ, పెద్దాస్పత్రులు,
ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతున్నాయి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇద్దరు వైద్యులు రోజు మార్చి రోజు తమకు
కేటాయించిన విలేజ్ క్లినిక్స్‌కు 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో
పాటు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు
చూశాక, మధ్యాహ్నం నుంచి మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు,
ఆరోగ్యశ్రీ రోగుల గృహాలను సందర్శించి వారికి ఇంటి వద్దే వైద్యం చేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి చిన్నారులు, విద్యార్థుల
ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఈ విధానంలో రాష్ట్రంలోని 10,032 వైఎస్సార్
విలేజ్ క్లినిక్‌లను నెలలో రెండు సార్లు పీహెచ్సీ వైద్యులు
సందర్శిస్తున్నారు. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య
పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్ కన్సల్టేషన్ సౌకర్యం కూడా
అందుబాటులో ఉంటోంది. ఏ రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే ఇక్కడి
నుంచే పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తారు. ఆ రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ
నెట్వర్క్ ఆస్పత్రికి తరలించడం, అక్కడ అతనికి వైద్యం అందేలా చూడటం వంటి
కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్ఎం చూస్తారు. వీరు విలేజ్ ఆరోగ్య మిత్రగా
వ్యవహరిస్తారు.
1.17 కోట్ల వైద్య సేవలు : ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్‌ను గత ఏడాదిలో
ప్రారంభించి ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చారు.
10,032 విలేజ్ క్లినిక్‌లను వైద్యులు 1.14 లక్షల సార్లు సందర్శించారు. ఈ
క్రమంలో 1,17,08,895 వైద్య సేవలు అందించారు.
నాడు–నేడుతో మహర్దశ : ఇది 2019కు ముందు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం
ఉప్పులూరు పీహెచ్సీ. నెర్రెలు చీలిన ప్రహరీ.. పిచ్చి మొక్కలు, గడ్డితో కూడిన
ఆవరణ, అపరిశుభ్ర వాతావరణం, కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు లేని దుస్థితి.
ఇక్కడికి రావాలంటేనే రోగులు వణికిపోయేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ
ఆస్పత్రిలో నాడు–నేడు కింద పనులు చేపట్టింది. కుర్చీలు, ఓపీ గదులు, 10 పడకలతో
ఇన్ పేషెంట్ వార్డు, కాన్పుల గది ఇలా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
చూపించుకోవడానికి జనం క్యూ కడుతున్నారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి
గురైన ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో
నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున
10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, వాటికి శాశ్వత భవనాలు
సమకూర్చే దిశగా అడుగులు వేశారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే
సొంత భవనాలు ఉన్న వాటికి మరమ్మతులు చేయడంతో పాటు, పాత భవనాల స్థానంలో కొత్త
భవనాలు నిర్మిస్తుండగా 882 చోట్ల పనులు పూర్తయి అధునాతనంగా ఆస్పత్రులు
తయారయ్యాయి.
121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్ ఆస్పత్రులను అభివృద్ధి
చేశారు. రూ.50 కోట్లతో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్
నిర్మాణం పూర్తయింది. ఇక్కడ వైద్యులు, సిబ్బందిని నియమించారు. ప్రభుత్వ కృషి
ఫలితంగా 443 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్
స్టాండర్డ్స్(ఎన్‌క్వాష్) గుర్తింపుతో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.
గుజరాత్, కేరళ, హరియాణా, తెలంగాణలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నాణ్యమైన
ప్రసూతి సేవలకు గాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపులో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ
ఉంది.
వైద్య విద్యలో నవశకం : రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు
చేస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలల్లో ఎంబీబీఎస్
అడ్మిషన్లు చేపట్టాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటికే నంద్యాల, ఏలూరు,
మచిలీపట్నం, విజయనగరం కళాశాలలకు అనుమతులు వచ్చాయి. రాజమండ్రి వైద్య కళాశాలకు
త్వరలో అనుమతి రానుంది. ఫలితంగా ఒక్కో చోట 150 సీట్లు చొప్పున 750 సీట్లు
పెరగనున్నాయి. 2024–25లో పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు.. ఆ తర్వాతి
ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు
రచించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో
బలోపేతం చేస్తోంది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా
భవిష్యత్‌లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతకు తావుండదు.