అశేషంగా తరలివచ్చిన భక్తజనం
మల్లాది వేంకట సుబ్బారావు–సుందరమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
అసమాన ప్రవచన చక్రవర్తి ‘బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు’: ఎమ్మెల్యే మల్లాది
విష్ణు
విజయవాడ : ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ప్రముఖ
ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. దుర్గాపురంలోని
ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణం నందు హనుమత్
వైభవంపై చాగంటి కోటేశ్వరరావుచే ప్రవచన కార్యక్రమం తొలిరోజు భక్తజనులను
సమ్మోహితులను చేస్తూ సాగింది. మల్లాది వేంకట సుబ్బారావు-సుందరమ్మ ఛారిటబుల్
ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైన కార్యక్రమంలో మాజీ మంత్రి
వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా
పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
చిన్నారులచే ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం హనుమాన్
చాలీసా పఠనం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
ఉపన్యసిస్తూ ఎవరైతే రామచంద్రుని పాదముల యందు భక్తి ప్రపత్తులతో ఉంటారో వారు
హనుమని ప్రత్యేకంగా పూజించాల్సిన అవసరం లేదన్నారు. ధర్మమునందు అనురక్తితో ఉండే
వారిని సర్వ కాలముల యందు ఆంజనేయుడు కాపాడుతాడని, ధర్మమునకు వ్యతిరేక స్వభావం
కలిగిన వారిని ఆయన శిక్షిస్తారన్నారు. అందుకే సకల దేవతల శక్తులను హనుమకి ధార
పోయాలని చతుర్ముఖ బ్రహ్మ అనుకున్నారని చాగంటి తెలిపారు. ఏ లక్షణములోనైనా హనుమ
కన్నా గొప్ప వారు మరొకరు లేరన్నారు. ఏ అస్త్రము ఆయనను తాకలేవని, అలాగే ఏ
ఆయుధం హనుమకి అవసరం లేదని, అదే ఆయన వీర వైభవమని చాగంటి అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విజ్ఞాన సారాన్ని దైనందన జీవిత
విధివిధానాలతో జోడించి సామాన్య పద ప్రయోగాలతో జన హృదయాలకు తాకేటట్లు మాట్లాడటం
చాగంటి వారికే చెల్లిందన్నారు. తన ప్రవచన ధారలతో చాగంటి వారు సమాజంలో మార్పు
తీసుకువస్తున్నారని, తాను కూడా ఆ ప్రవచనాలను వింటూ ఎంతో స్ఫూర్తిని
పొందుతున్నట్లు వివరించారు. శ్రీమద్భాగవతం, రామాయణం, శివ పురాణము, దేవీవైభవం,
రుక్మిణీ కల్యాణం, గోమాత విశిష్టత, హనుమద్వైభవం.. ఇలా పురాణాలపై అనేక
ప్రవచనాలు చేశారన్నారు. తన వాక్పఠిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల
నుండి ప్రశంసలు అందుకోవడంతో పాటు బ్రహ్మశ్రీ అని గౌరవ నామాన్ని పొందారన్నారు.
ఆయన ప్రవచనాలు విన్నవారి మనసులని హత్తుకునేవిగా, ఆలోచింపజేసేవిగా ఉంటాయన్నారు.
భారతీయ సంస్కృతిక, సాంప్రదాయం, ఆధ్యాత్మికతలను పెంపొందిస్తూ.. వాటి
పరివ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్న చాగంటి వారి జీవితం ప్రతిఒక్కరికీ
ఆదర్శప్రాయమన్నారు. అనంతరం ప్రవచన కర్తను మల్లాది విష్ణు చేతులమీదుగా ఘనంగా
సత్కరించారు. భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ
మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి, దుర్గ గుడి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు,
మల్లాది వేంకట సుబ్బారావు-సుందరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మల్లాది
రాజేంద్ర, మల్లాది శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్
ఇంఛార్జిలు, కోఆర్టినేటర్లు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.