విజయవాడ : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర
కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి గ్రామ
వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి
ముఖ్య అతిథులుగా ఏపీ జిఈఏ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ, రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు హాజరయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశనికి
హాజరైన సభ్యుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల
సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగగా సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా షేక్ అబ్దుల్
రజాక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూన వెంకట సత్యనారాయణ, సహాధ్యక్షులుగా
వరప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చక్రపాణి నాయుడు, ఇందురుపల్లి మణీ,
మస్తాన్,రాష్ట్ర కార్యదర్శి గా లక్ష్మి నారాయణ, రాష్ట్ర సంయుక్త
కార్యదర్శులుగా మధులత, అయ్యప్ప, పార్షా మధు, ఆదిమూర్తి, కార్యవర్గ సభ్యుడిగా
కెనడీ ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏర్పడిన సంఘం సచివాలయ ఉద్యోగుల
సమస్యల పరిష్కారం కొరకు రాబోయే మూడు సంవత్సరాల పాటు పనిచేస్తుంది. రాష్ట్ర
కార్యవర్గ ఎన్నిక అనంతరం, రాష్ట్రంలోని 21 జిల్లాలకు జిల్లా కమిటీలను రాష్ట్ర
అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ ప్రకటించారు.
ఈ సమావేశానికి హాజరైన కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ
ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, మొదటి మరియు రెండవ నోటిఫికేషన్ ద్వారా
నియమితులైన ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందున రావాల్సిన
బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంతి ఆస్కార్ రావు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు
తక్షణమే సాధారణ బదిలీలు మరియు అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాలని, యూనిఫాం
విధానాన్ని తొలగించాలనిర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర
అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులపై
స్పష్టత కల్పించి వాటిని సర్వీసు రూల్స్ లో పొందుపరచాలని, సచివాలయ ఉద్యోగుల
సమస్యల పరిష్కారం కొరకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని, 12వ పిఆర్సి లో
సచివాలయ ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మే 22 వ తేదీ నుంచి జరగబోయే
ఉద్యమ కార్యాచరణను పూర్తిగా మద్దతు ఇస్తున్నామని, సచివాలయ ఉద్యోగులు ఈ
కార్యాచరణలో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ
వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూన వెంకట
సత్యనారాయణ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు జాబ్ కార్డ్ ప్రకారం రావలసిన
అధికారాలు ఇవ్వాలని, సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ సిమ్ కార్డులు
ఇవ్వాలని, పండుగ దినాల్లో – సెలవు దినాల్లో సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి
డ్యూటీలు కేటాయించకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ
ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాలపై చర్చించి, పలు అంశాలపై తీర్మానాలు
చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల
సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.