తానేటి వనిత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
కొవ్వూరు : బడుగు, బలహీన వర్గాల ప్రజలను కించపరచేలా మీకిచ్చే సెంటు భూమి శవం
పూడ్చడానికి సరిపోతుందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను
రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డా. తానేటి వనిత ఖండించారు.
శనివారం కొవ్వూరులో హోంమంత్రి క్యాంపు కార్యాలయం నుండి చంద్రబాబు నాయుడు
వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీని ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి నిరుపేద
కుటుంబానికి ఇళ్లు అందించి ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు లేని పేదలు ఉండరాదనే
లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళలో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి పేద
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని
వివరించారు. బడుగు బలహీన వర్గాల ఇళ్ల స్ఠలాలపై చంద్రబాబు వ్యాఖ్యలతో వారి
రాజకీయ జీవితానికి, టీడీపీకి సమాధి చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆమె
స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ చంద్ర బాబు నాయుడు పేదల ఇంటి స్థలాలను
స్మశాన వాటికలతో పోల్చడాన్ని ఖండించారు. ఆయనకు పేదలపై ఉన్న అగౌరవం, హేయమైన
భావాన్ని చంద్రబాబు వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల
స్థలాలు ఇవ్వడం ప్రతిపక్ష నేతకి ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే సెంటు స్థలాలు
అంటూ సమాధులు కట్టుకోవడానికే ఉపయోగపడతాయని వెటకారాలాడుతున్నారని తెలిపారు.
చంద్రబాబు ప్రజలు 2019లోనే రాజకీయ సమాధి కట్టారని, 2024లో ప్రతిపక్ష పార్టీని
బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనన్నారు. ఈ విషయం గ్రహించే ఆ
ప్రస్టేషన్ లో చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. వెంటనే బడుగు, బలహీన
వర్గాలపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హోంమంత్రి డిమాండ్ చేశారు.
సామాన్యుడికి సొంత ఇల్లు ఉండాలనేది ఓ కల అని.. ఆ కలను సాకారం చేసేందుకు జగనన్న
ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. పేదవాడు అభివృద్ధిని చూడటం చంద్రబాబు నాయుడుకి
ఇష్టం లేదని, గత ప్రభుత్వం పెత్తందారుల పక్షమని.. ఈ ప్రభుత్వం బడుగు, బలహీన
వర్గాల పక్షమని స్పష్టం చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి
రాజధాని చుట్టుపక్కల పేదల కోసం అక్కడ ఆర్-5 జోన్ ని ఏర్పాటు చేసి సెంటు
స్థలాలు ఇవ్వడానికి జగనన్న ప్రభుత్వం సిద్దపడితే.. దానిని అడ్డుకోవడానికి
రైతుల ముసుగులో స్థానికేతరులకు స్థలాలు ఇవ్వడానికి వీల్లేదంటూ హైకోర్టుకి
వెళ్లి ప్రతిపక్షం అడ్డుకోవాలనుకున్నారని, స్టే కూడా తెచ్చుకున్నారని
వివరించారు. ప్రభుత్వం ఎలాగైనా పేదలకు మేలు చేయాలన్న తపనతో సుప్రీంకోర్టును
ఆశ్రయించిందని, ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో
త్వరలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారని
తెలిపారు. రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్లు ఇచ్చి తీరుతామని మంత్రి
తానేటి వనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనకు
వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు నినాదాలు చేశారు. ప్రజలకు
చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.