ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా
శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం జనగామ జిల్లా పాలకుర్తి
నియోజకవర్గం కొడకండ్ల మండలం లక్ష్మక్క పల్లె గ్రామంలో రూ.20 లక్షలతో
నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. సర్దార్
సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠ కు భూమి పూజ చేశారు. బొడ్రాయి పండుగ, దుర్గమ్మ
పండుగలో పాల్గొన్నారు. అనంతరం గ్రామ సమీపంలో నిర్మాణం అవుతున్న బ్రిడ్జి
పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ,
లక్ష్మక్క పల్లె ను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామని, మండలంలో ఈ
గ్రామాన్ని ఒక ప్రత్యేక కూడలిగా అభివృద్ధి పరిచేందుకు అన్ని ఏర్పాట్లు
చేస్తున్నామని చెప్పారు. లక్ష్మక్క పల్లి నుండి చుట్టుముట్టు గ్రామాలను
కలుపుతూ అన్ని రోడ్లను డబల్ రోడ్లుగా మార్చామని, తారు రోడ్లు వేసామని గ్రామంలో
అంతర్గతంగా సిసి రోడ్లు మురుగునీటి కాలువలు నిర్మించామని మంత్రి వివరించారు.
ఒకప్పుడు గ్రామంలో రోడ్లు మంచినీరు కూడా సరిగా లేని దుస్థితి నుంచి ఇవాళ అన్ని
రకాల మౌలిక సదుపాయాలను కల్పించుకున్నామని ప్రజల హర్షద్వానాల మధ్య మంత్రి
ఎర్రబెల్లి ప్రకటించారు. ఈరోజు గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని
ప్రారంభించుకున్నామని, ఇంకా గ్రామంలో అవసరమైన అన్ని అభివృద్ధి పనులను త్వరలోనే
పూర్తి చేసుకుంటామని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో
అనేకమంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ లాగా పని చేసే సీఎంని తాను
తన 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు చూడలేదని మంత్రి చెప్పారు. ప్రజా
అవసరాలకు సరిపోయే పథకాలన్నింటిని రూపొందించి అమలు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి
దేశంలోనే లేరని అది కెసిఆర్ మాత్రమేనని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని
సాధించి అనతి కాలంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నెంబర్ వన్ గా నిలిపిన ఘనత
కేసిఆర్ కి దక్కుతుందన్నారు. ఇవ్వాలా సీఎం కేసీఆర్ రూపొందించిన అభివృద్ధి
నమూనా దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకం అందని
గ్రామ, కుటుంబం లేదని మంత్రి తెలిపారు.
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠాపన కు భూమి పూజ
సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడు. సామాన్య కుటుంబం లో పుట్టి, అతి
గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆయన కేవలం వ్యక్తి మాత్రమే కాదు శక్తి. నిజాం
పాలన పై తిరుగుబాటు చేసి, ఆ పాలన పై యుద్ధం ప్రకటించారు. ఆయన మన ప్రాంతంలో
పుట్టడం మన అదృష్టం అని మంత్రి అన్నారు. ఆయన పోరాటం భావి తరాలకు స్ఫూర్తి.
అందుకే సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది.
హైదరాబాద్ లో 5 ఎకరాల స్థలం లో సర్వాయి పాపన్న పేరుతో ఒక భవనం ఏర్పాటు
చేస్తున్నారని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో నేను ప్రతి గ్రామంలో గౌడ
కమ్యూనిటీ హాలు కట్టించాను. గిరక తాళ్ళు ఏర్పాటు చేయాలి. కల్లు బాగా వస్తుంది.
2 ఏళ్ళ కింద నేను పాలకుర్తి నియోజకవర్గం లో గిరక తాళ్ళు పెట్టించాను. సీఎం
గౌడల కోసం ఎంతో చేస్తున్నారు వైన్ షాపుల్లో 15శాతం రిజర్వేషన్లు కల్పించారు.
కంఠ మహేశ్వర దేవుడి పేరున నియోజకవర్గం లో 20కి పైగా గుడులు కట్టించాను. గౌడ్
లు అన్ని రంగాల్లో ముందున్నారు. అనంతరం దుర్గమ్మ పండుగ, బొడ్రాయి పండుగ ల
సందర్భంగా మంత్రి లక్ష్మక్క పల్లె ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పూజ
కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌడ సోదరుల అభిమానంగా పోసిన కల్లును తాగారు.
బోనమెత్తారు. ప్రజలతో కలిసి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు
మేళతాళాలతో మంత్రుని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్
దేశాయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, సంబంధిత శాఖల అధికారులు
పాల్గొన్నారు.