దివ్యాంగులకు చేయుత
”నిరామయ ఆరోగ్య బీమా” పథకాన్ని అమలు చేసేందుకు విశాఖ జిల్లా యంత్రాంగం
ముందడుగు
జిల్లా కలెక్టర్, ఉద్యోగుల చొరవతో ”సంజీవిని నిధి” ద్వారా శ్రీకారం
విశాఖపట్నం : ఆటిజం, సెరిబ్రల్-పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్
డిజేబిలిటీస్ మొదలగు దివ్యంగులకు ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు ”నిరామయ
ఆరోగ్య బీమా” పధకాన్ని జిల్లా కలెక్టర్ డా ఎ మల్లికార్జున ప్రారంభించారు.
శనివారం అక్కయ్యపాలెం , విశాఖ అర్బన్ భవిత కేంద్రం లో ఏర్పాటు చేసిన
కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి
కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎ.
మల్లికార్జున మాట్లాడుతూ జిల్లాలో ‘‘ ఆటిజం, సెరిబ్రల్-పాల్సీ, మెంటల్
రిటార్డేషన్ మరియు మల్టిపుల్ డిజేబిలిటీస్ ‘‘ తో ఉన్న దివ్యాంగులకు కేంద్ర
ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ విభాగం కింద వచ్చే
నేషనల్ ట్రస్ట్ ద్వారా ”నిరామయ ఆరోగ్య బీమా” పథకం నిర్వహిస్తుందని
అన్నారు. జిల్లాలో ద ఎబిలిటీ పీపుల్ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులకు తక్కువ ధరలో ఆరోగ్య బీమాను
అందించే ‘‘ నిరామయ ఆరోగ్య బీమా ‘‘ పథకం జిల్లాలో ఉన్న పై నాలుగు కేటగిరీల లో
దివ్యాంగులకు లబ్ది చేకూర్చేందుకు అవసరమైన ప్రీమియం మొత్తాన్ని
చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరోగ్య భీమా కు అవసరమైన ప్రీమియం మొత్తం రూ .
1,34,750 సంజీవిని నిధి నుండి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆరోగ్య బీమా
ద్వారా ఈ తరహా దివ్యాంగులకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్య ఖర్చుల నిమిత్తం
ఒక లక్ష వరకు ఒక సంవత్సరకాలంలో రియంబర్స్మెంట్ వస్తుందని తెలిపారు. జిల్లాలో
మొత్తం 512 మంది దివ్యాంగులకు ( అటిజం-12, సెరిబ్రల్-పాల్సీ 109. మెంటల్
రిటార్డేషన్-387, మల్టిపుల్ డిజేబిలిటీస్-4) అవసరమైన ప్రీమియం చెల్లింపు
చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద వచ్చే దివ్యాంగులందరూ ఈ ఆరోగ్య భీమా
పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖ జిల్లాలో ఈ
నిరామయ ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
సంజీవని నిధి – డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్
నా సూచన మేరకు ఉద్యోగులందరూ నూతన సంవత్సరం రోజున వారి కష్టార్జితం నుండి సొంత
సొమ్మును సంజీవిని నిధి లో జమ చేశారు . ఇప్పటివరకు 15 లక్షల రూపాయలు నిధులు జమ
అయిందని తెలిపారు. పేద ప్రజలు, నిర్భాగ్యులు, ప్రత్యేక అవసరాలు కలిగిన మానసిక
వికలాంగులు మొదలైన వారి సహాయం కోసం ఈ నిధిని ఉపయోగించడం జరుగుతుందని జిల్లా
కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఈరోజు కార్యక్రమానికి సంజీవిని నిధి నుండి
సొమ్మును ఖర్చు చేస్తున్నానని, కాబట్టి ఈ కార్యక్రమం గొప్పతనం ఉద్యోగులందరికీ
దక్కుతుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన
ఉద్యోగులందరికీ జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా
తల్లిదండ్రులను కోల్పోయిన తల్లి లేదా తండ్రిని కోల్పోయిన ఆడపిల్లలను గుర్తించి
సుకన్య సమృద్ధి యోజన పథకంలో కూడా ప్రీమియం ఈ నిధి ద్వారా చెల్లించుటకు
ప్రణాళిక చేస్తున్నట్లు వివరించారు. ఐఓసీఎల్ వారి సహాయంతో జిల్లాలో 60 లక్షల
రూపాయలతో దివ్యాంగులకు ఉపకరణాలు, వీల్ చైర్లు, ట్రై సైకిల్స్ మరో రెండు
నెలల్లో అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ జిల్లాలో ఎంతో క్రొత్త ఒరవడితో
దివ్యాంగులు, నిరుపేదలు, అనాధలు పట్ల జిల్లా కలెక్టర్ చూపిస్తున్న చొరవ ఎంతో
ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఎంతో వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని అమలుకు కృషి
చేశారని అన్నారు. చాలా మంచి ఆలోచన కార్యక్రమమని తెలిపారు. ఈ కార్యక్రమం అమలులో
సంజీవని నిధికి ఉద్యోగులు అందించిన సహకారం ఎంతో కీలకమని అన్నారు.
ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ద ఎబిలిటీ పీపుల్ సంస్థ ఫౌండర్ దిలీప్
పాత్రో మాట్లాడుతూ దివ్యాంగులు, చిన్నారులు, ఆడపిల్లలు పట్ల జిల్లా కలెక్టర్
ఎంతో మహోన్నతంగా ఆలోచించి జిల్లాలో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లాతో పాటు, రాష్ట్రంలో గల అన్ని జిల్లాల్లో అమలకు
అధికారులకు కృషి చేయాలని అన్నారు. ఈ నిరామయ ఆరోగ్య భీమా ద్వారా జిల్లాలో
ఆటిజం, సెరిబ్రల్-పాల్సీ, మెంటల్ రిటార్డేషన్ మరియు మల్టిపుల్ డిజేబిలిటీస్
దివ్యాంగులకు అవసరమైన ఆరోగ్య ఖర్చులు నిమిత్తం ఈ బీమా పథకం ఉపయోగపడుతుందని, ఈ
భీమాలో ఆసుపత్రికి వెళ్లేందుకు రవాణా చార్జీలు కూడా అందించడం జరుగుతుందని
అన్నారు . అందరూ వినియోగించుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్
ఉద్యోగులతో కలిసి ఈ ఆరోగ్య భీమాకు అవసరమైన ప్రీమియం మొత్తం రూ . 1,34,750
చెక్కు రూపేణా అందించారు. ఈ కార్యక్రమంలో రంగయ్య., సెక్రటరీ, వీఎమ్ఆర్డిఏ,
విశాఖ ఆర్డీవో హుస్సేన్ సాహబ్ , భీమిలి ఆర్డీవో భాస్కర్ రెడ్డి, వికలాంగుల
సంక్షేమ సహాయ సంచాలకులు మాధవి, సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్
కోఆర్డినేటర్ శ్రీనివాస్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరరావు,
జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి సుబ్బిరెడ్డి, చీఫ్ ప్లానింగ్ అధికారి
శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు ఈ
కార్యక్రమానికి హాజరయ్యారు.