విజయవాడ : ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి ఇటీవల జరిగిన పదో తరగతి,
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర
ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు పేరిట సత్కరించనున్నట్లు రాజ్యసభ సభ్యులు,
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు
సామాజిక మాధ్యమాల వేదికగా శుక్రవారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. పదో తరగతి
పరీక్షల్లో టాప్-3లో నిలిచిన వారికి పురష్కారాలు అందజేయనున్నారని అలాగే
ఇంటర్మీడియట్ లో ప్రతి గ్రూపులో టాపర్ గా నిలిచిన విద్యార్థులుకు
సత్కరించనున్నట్లు తెలిపారు. పదో తరగతిలో 1246, ఇంటర్మీడియట్ లో 1585 మంది
సత్కారానికి అర్హత సాధించినట్లు ఆయన వెల్లడించారు.
వలంటీర్లకు పురస్కారాలు : వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి
వందనం చెబుతూ వరుసగా మూడో ఏడాది అవార్డులు అందించనున్నట్లు విజయసాయి రెడ్డి
తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల వలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర
పురస్కారాలు ప్రదానం చేయనున్నారని అన్నారు. ఉత్తమ సేవలందించిన 2,33,719 మంది
వలంటీర్లకు నగదు పురస్కారాల రూపంలో రూ.243.34 కోట్లు అందించనున్నారని అన్నారు.
ఆన్ లైన్ మోసాలపై కఠిన చర్యలు చేపట్టాలి : దేశంలో జరుగుతున్న అనేక రకాల
మోసాలలో 57% మోసాలు ఆన్ లైన్ లో జరుగుతున్న మోసాలే అని విజయసాయి రెడ్డి
అన్నారు. అనేక రకాలు మోసపూరిత కాల్స్ మనందరికీ తరచుగా వస్తుంటాయని ఆయన
గుర్తుచేశారు. దేశంలో అనేక మోసపూరిత కాల్ సెంటర్లు కూడా నడుస్తున్నాయని,
బాధాకరంగా అవి విదేశీయులను కూడా లూటీ చేస్తున్నాయని అన్నారు. ఈ మోసాలను
అరికట్టేందుకు సమర్దవంతమైన పిర్యాదు విధానం, ట్రాకింగ్, శిక్షలు అమలు చేయాలని
అన్నారు.
హార్డ్ వేర్ తయారీ రంగంలో గ్లోబల్ లీడర్ దిశగా ఇండియా : మొబైల్ తయారీలో
ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారతదేశం, హార్డ్ వేర్ తయారీలోనూ గ్లోబల్
లీడర్ గా అవతరించనుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
హార్డ్ వేర్ ఉత్పత్తికి సంబందించి ప్రమోషన్ స్కీం 2.O కేంద్ర కేబినెట్
ఆమోదించిన అనంతరం భారతదేశంలో ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ ఒన్ పీసీ
సర్వీసెస్ మరింతగా మెరుగుపడతాయని అన్నారు. గత 8 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్
తయారీలో భాతరదేశం 17% వృద్ది రేటుతో స్థిరంగా వృద్ది చెందుతోందని అన్నారు. ఈ
సంవత్సరం ఇండియా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రూ.9 లక్షల కోట్లు ఉత్పత్తి
సాధించి రికార్డు సృష్టించిందని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబందించి
అన్ని రంగాల్లో ఇండియా దూసుకెల్తోందని ఆయన అన్నారు.
ప్రసాద్ స్కీంలో కోటప్పకొండ, ఒంటిమిట్ట ఆలయాలు : కేంద్ర ప్రభుత్వ ప్రసాద్
స్కీంలో పల్నాడులోని కోటప్పకొండ, ఒంటిమిట్టలోని కోదండరామ ఆలయాలను చేర్చాలని
కోరుతూ లేఖ ద్వారా పంపిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్నందుకు కేంద్ర పర్యాటక
శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని విజయసాయి రెడ్డి
అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యుత్తరంపై హర్షం వ్యక్తం
చేస్తూ శుక్రవారం సోషల్ మీడియాలో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే
కేంద్రానికి ప్రాజక్టు ప్రపోజల్ పంపిస్తుందని అన్నారు. ప్రసాద్ స్కీం కింద
దేశంలో మతపరమైన పర్యాటక కేంద్రాలు, తీర్ధయాత్రల ప్రదేశాలను గుర్తించి, వాటిని
అభివృద్ధి, నిర్వహించడం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప చొరవ అని ఆయన
కొనియాడారు.