‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
విజయవాడ : ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం
చెబుతూ వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా
రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం వైఎస్
జగన్మోహన్రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టారు. విజయవాడ ఏ ప్లస్
కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తమ
వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేసి
సత్కరించారు.
సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారని, ప్రతి
నెలా 1న 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్న సైనికులే వాలంటీర్లు అని సీఎం
జగన్ అన్నారు. 2.66 లక్షల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పేదలకు సేవ
చేస్తున్నారు. కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, 90 శాతం గడపలకు వెళ్లి పెన్షన్
ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదని, అమ్మఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు, రైతు
భరోసా వంటి పథకాలను అందిస్తున్నారన్నారు. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల
జనం నష్టపోయారు. పెన్షన్‌తో పాటు రేషన్ డోర్ డెలివరీ, బియ్యం కార్డు,
ఆరోగ్యశ్రీ కార్డులు అదేలా వాలంటీర్ల సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు : 25 రకాల పథకాలకు
వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు. డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా
లబ్ధిదారులకు అందించాం. నాన్ డీబీటీ కలిపితే మొత్తం రూ.3లక్షల కోట్లు
అందించాం. ప్రభుత్వంపై నిందలు వేస్తే నిజాలు చెప్పగలిగిన సత్యసారథులు
వాలంటీర్లే. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని,
మంచి చేశాం కాబట్టే గడపగడపకు వెళ్లగలుగుతున్నామన్నారు. వాలంటీర్ల వ్యవస్థ
అంటే చంద్రబాబుకు కడుపుమంట అని పేర్కొన్నారు.
వాలంటీర్ల సేవలు అభినందనీయం : మంత్రి ఆదిమూలపు సురేష్
ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర
పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చిట్ట చివరి కుటుంబానికి
సంక్షేమ పథకాలు అందడమే సీఎం లక్ష్యం అన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు
దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, వరదల సమయంలో వాలంటీర్ల సేవలు
అభినందనీయమని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగన్‌తోనే సాధ్యం : మంత్రి ముత్యాల నాయుడు
గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగన్‌తోనే సాధ్యమైందని డిప్యూటీ సీఎం,
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ప్రతి గడపకు వెళ్లి
వాలంటీర్లు సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు
అందేలా వాలంటీర్ల కృషి చేసున్నామని మంత్రి అన్నారు..
జగనన్న సైనికులుగా ఉన్నందుకు గర్విస్తున్నాం : వాలంటీర్లు
మా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వాలంటీర్లు అన్నారు. అర్హులైన
ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు.ప్రజల
చిరునవ్వులు, ఆశీర్వాదాలే మాకు కొండంత బలం. జగనన్న సైనికులుగా ఉన్నందుకు
గర్విస్తున్నాం’’ అని వాలంటీర్లు అన్నారు.