విజయవాడ : ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్
పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించే
కార్యక్రమానికి ‘జగనన్న ఆణిముత్యాలు’ అనే పేరు పెట్టినట్లు విద్యా శాఖ మంత్రి
బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలో మంత్రి వివరాలు వెల్లడించారు. ‘‘31న
రాష్ట్రస్థాయిలో విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం
జగన్ హాజరవుతారు. ఈ నెల 25న నియోజవర్గ స్థాయిలో పదో తరగతిలో మొదటి మూడు
స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు,
ఇంటర్మీడియట్లో గ్రూప్‌ల వారీగా ప్రతిభ చూపిన ఒక్కొక్కరికి రూ.15 వేలు
చొప్పున అందిస్తాం. తరువాత 27వ తేదీన జిల్లా స్థాయిలో పదో తరగతిలో మొదటి మూడు
స్థానాల్లో ఉన్న వారికి రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.15 వేలు నగదు బహుమతులు
అందిస్తామన్నారు.
31వ తేదీన రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.లక్ష,
ద్వితీయ స్థానానికి రూ.75 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.50
వేలు ప్రోత్సాహకం ఇస్తాం. ఇంటర్మీడియట్లో గ్రూప్‌నకు ఒకరికి చొప్పున జిల్లా
స్థాయిలో రూ.50 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.లక్ష అందిస్తాం. విద్యార్థులతో పాటు
వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుల్ని, ప్రిన్సిపాళ్లను సన్మానిస్తాం’’ అని
వివరించారు. ఈ నెల 24న విద్యాదీవెన ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తామని,
అమ్మఒడికి సంబంధించి ఇంకా తేదీ ఖరారు కాలేదని వివరించారు.
జీవో-1లో మార్పులా?: ‘తినబోయే ముందు రుచులెందుకు? ఓపిక పట్టండి. అదేమీ
అత్యవసర విషయమేమీ కాదు కదా?’ అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
జీవో-1లో మార్పులు చేసి మళ్లీ తీసుకొస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు
ఆయన పైవిధంగా స్పందించారు. ఎన్నికల సమయంలో జీవో-1 మళ్లీ తీసుకొస్తే వైకాపాకు
కూడా ఇబ్బందే కదా? అని విలేకరులు అడగ్గా ‘మాకేంటి ఇబ్బంది? మేం చట్టం ప్రకారమే
ఉంటాం’ అని పేర్కొన్నారు. ఎన్నికలు వేగంగా వస్తాయని టీడీపీ నాయకులు
ఊహించుకుంటున్నారు.. రాజ్యాంగం, చట్టం ఒకటిఉంది. దాని ప్రకారమే జరుగుతాయన్నారు.