253 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం వైఎస్ జగన్ పాలన
కొనసాగుతోందని, మేనిఫెస్టోలోని 98 శాతానికిపైగా హామీలు అమలు చేసి చూపించారని
ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
59 వ డివిజన్ 253 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
గురువారం పండగ వాతావరణంలో సందడిగా సాగింది. స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా
సుల్తానా, అధికారులతో కలిసి అజిత్ సింగ్ నగర్లో పర్యటించిన మల్లాది విష్ణుకి
ప్రజల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. 313 గడపలను సందర్శించి సంక్షేమ పథకాల
అమలు తీరుపై ఎమ్మెల్యే ఆరా తీశారు. తమ ఇంటికి విచ్చేసిన ప్రజాప్రతినిధులను
స్థానికులు సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. దుశ్శాలువలతో ఘనంగా
సత్కరించారు. తెలుగుదేశం హయాంలో సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా
చేశారని, జన్మభూమి కమిటీల పేరుతో లూటీ చేశారని స్థానికులు ఎమ్మెల్యే వద్ద
వాపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు
తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని వివరించారు.
జగనన్న పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. గత నాలుగేళ్ల కాలంలో
సచివాలయ పరిధిలో రూ. 5.02 కోట్ల సంక్షేమాన్ని అందించామంటే కేవలం వాలంటీర్ల
వ్యవస్థ ద్వారానే సాధ్యపడిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చేతులమీదుగా వాలంటీర్లకు వందనం
నిస్వార్థ సేవలకు ప్రతిరూపం వాలంటీర్ల వ్యవస్థ అని మల్లాది విష్ణు అన్నారు.
ప్రజలకు ఈ తరహాలో జవాబుదారీతనంగా వ్యవహరిస్తున్న వ్యవస్థను గతంలో ఎన్నడూ
చూడలేదన్నారు. అటువంటి వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏటా సేవామిత్ర,
సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలతో ఘనంగా సత్కరించడం జరుగుతోందన్నారు. ఈ
ఏడాదికి సంబంధించి రేపు విజయవాడలో ముఖ్యమంత్రి చేతులమీదుగా ఉత్తమ వాలంటీర్లను
సత్కరించుకోనున్నట్లు తెలిపారు. వాలంటీర్లు అని చిన్నచూపు చూసే వారంతా
తలదించుకునేలా.. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
సుప్రీం తీర్పు టీడీపీకి చెంపపెట్టు
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయిస్తే తెలుగుదేశం నేతలకు ఎందుకంత కడుపు మంట
అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ధనికులు తప్ప అమరావతిలో పేదలు ఉండకూడదనేదే
చంద్రబాబు ఆలోచన అని మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా
మూడున్నరేళ్లు కోర్టులకెళ్లి అడ్డుకోవడంలోనే పేదవాడంటే వారికి ఎంత చులకనో
అర్థమవుతోందన్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని
సమర్థిస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం శుభపరిణామమన్నారు. ఈ
ప్రభుత్వం పేదల ప్రభుత్వమని చెప్పడానికి ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్లు
కేటాయించడమే నిదర్శనమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కానీ తెలుగుదేశం
అధికారంలోకి వస్తే అమరావతిలోని పేదలందరినీ ఖాళీ చేయిస్తామని ఆ పార్టీ
అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పడం వారి అహంకారానికి అద్దం పడుతోందన్నారు.
సమాధి కట్టడానికి కూడా సెంటు స్థలం సరిపోదని చంద్రబాబు దిగజారి
మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు
పట్టుకోవడం ప్రతిపక్ష నేతకు అలవాటైపోయిందని ధ్వజమెత్తారు. హౌస్ ఫర్ ఆల్
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ సిద్ధాంతమని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
నగరంలో 95 వేల మందికి ఇళ్ల పట్టాలు కేటాయించినట్లు మల్లాది విష్ణు చెప్పారు.
తన హయాంలో రెండు సెంట్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. నగరంలో
ఎవరికి ఇచ్చారో ఒక్కరి పేరైనా చెప్పగలరా..? అని సూటిగా ప్రశ్నించారు. కనుక
కుట్రలు, కుయుక్తులు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో
డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి,
నాయకులు హఫీజుల్లా, నందెపు సురేష్, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నేరెళ్ల శివ,
భూమా రమేష్, కంభగళ్ల రాజు, మీసాల సత్యనారాయణ, కృష్ణ, కొండలరావు, నాయక్,
తమ్మిశెట్టి రాజు, బాబా, నాగుల్ మీరా, శాంతకుమారి, షేక్ షెహనాజ్, అన్ని శాఖల
అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.