గుండెజబ్బులతో మృత్యువాత పడుతున్న వారిలో భారత్ వాటా 16.5 శాతం
ప్రజలలో శారీరకంగా శ్రమ తక్కువ కావటం గుండె జబ్బుల మరణాలకు ప్రధాన కారణం
టెక్నాలజీ సాయంతో సమర్థవంతమైన వైద్య సేవలు
రాష్ట్రంలో ఆరోగ్య రంగంపై జిడిపిలో 2.96 శాతం మేర ఖర్చు
అమరావతి : అసాంక్రమిక వ్యాధుల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ
నిర్దేశించిన ‘హార్ట్స్’ వ్యూహాన్ని అమలు చేసే దిశగా తాము ప్రణాళికలు సిద్ధం
చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ
ఎంటి కృష్ణబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జి-20 సదస్సు
భాగస్వామ్యంతో గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కో బ్రాండెడ్ కార్యక్రమంలో అయన
మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో
గుండెజబ్బుల భారం పెరిగిపోతోందని అందోళన వ్యక్తం చేశారు.
గుండెజబ్బులతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య ప్రపంచ జనాభాలో 15.5 శాతం మేర
వుండగా అందులో భారత్ వాటా 16.5 శాతం మేర వుందన్నారు. ఇది అత్యంత ఆందోళనకరమైన
పరిస్థితి అనీ, దీనిని చక్కదిద్దటానికి తక్షణమే ఒక వ్యూహాన్ని అమలు చేయాల్సిన
అవసరం వుందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పార్ట్స్ వ్యూహం
ద్వారా గుండె జబ్బుల నిరోధానికి, ముందస్తుగా గుర్తించేందుకు, ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాల ద్వారా అవసరమైన చికిత్సను అందించేందుకు వీలవుతుందన్నారు. ప్రపంచ
వ్యాప్తంగా ప్రజలలో శారీరకంగా శ్రమ తక్కువకావటం గుండె జబ్బుల మరణాలకు ప్రధాన
కారణంగా గుర్తించటం జరిగిందన్నారు. ఈ కారణం వల్ల ఏటా 32 లక్షల మందికి పైగా
ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజలలో శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందించటం
ద్వారా అసాంక్రమిక వ్యాధుల మరణాలను తగ్గించేందుకు భారత్లో అనేక
అవకాశాలున్నాయన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు
తీసుకుంటోందని ఆయన వివరించారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో యోగా తరగతుల
నిర్వహణ, ప్రజల శారీరక వ్యాయామం కోసం ప్రైవేటు విద్యాసంస్థలలలోని ఖాళీ
స్థలాలను వినియోగించుకోవటం, శారీరక శ్రమపై అవగాహన పెంచేందుకు విస్తృత
ప్రచారాన్ని కల్పించటం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా జాతీయ
పాగాకు నియంత్రణా కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పాగాకు
వినియోగంపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు టుబాకో క్విట్ లైన్ సర్వీస్ ను ఏర్పాటు
చేశామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలయిన తిరుమల తిరుపతి, విజయవాడ వంటి
ప్రాంతాలలోని దేవాలయాలను ధూమపాన రహిత కేంద్రాలుగా ప్రకటించారన్నారు. స్కూల్
స్థాయిలో పొగాకు వినియోగాన్ని అడ్డుకునేందుకు టాఫీ (టుబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్
ఇన్స్టిట్యూషన్స్) కార్యకలాపాలను సంబంధ్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో 9
జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. సరైన పోషకాహారాన్ని
తీసుకోవటంపై అవగాహన పెంపొందించేందుకు ఈట్ రైట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర
వ్యాప్తంగా సుశిక్షితులైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించామన్నారు.
రాష్ట్రంలో ఆరోగ్య రంగంపై జిడిపిలో 2.96 శాతం మేర ఖర్చు చేస్తున్నామన్నారు.
(అ)సాంక్రమిక వ్యాధుల వ్యాప్తిని ముందుగా గుర్తించటం కోసం 2021 అక్టోబర్లో
ఎఎన్ఎంల ద్వారా ఎన్ సిడి-సిడీ సర్వే నిర్వహించామన్నారు. అసాంక్రమిక వ్యాధులైన
రక్తపోటు, మధుమేహం వంటి వాటిని గుర్తించేందుకు ఎఎన్ఎంలకు బిపి ఆపరేటస్,
హిమోగ్లోబినోమీటర్, గ్లూకోమీటర్, ఎత్తు, బరువు కొలిచే పరికరాలను అందచేసి
వివరాలను సేకరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అసాంక్రమిక వ్యాధిగ్రస్తులను
గుర్తించే ప్రయత్నంతో పాటు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) గుర్తింపు
కార్డులను కూడా జారీ చేసి పేషెంట్లకు అందచేశామన్నారు. ఇప్పటి వరకూ 3.64 కోట్ల
మంది ప్రజలకు ఎన్ఎ స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. ఈ స్క్రీనింగ్ వివరాలను
ఫ్యామిలీ డాక్టర్ మొబైల్ యాప్ ద్వారా సేకరించి నిక్షిప్తం చేశామన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ గ్రామాన్ని నెలకు రెండు సార్లు డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్
హెల్త్ క్లినిక్ ను సందర్శించి అసాంక్రమిక వ్యాధి గ్రస్తులను
పరిశీలిస్తున్నారన్నారు. నిర్ధారింపబడిన కేసుల్లో ఆమోదయోగ్యమైన చికిత్సా
విధానాన్ని కూడా ఫ్యామిలీ డాక్టర్ అందిస్తారన్నారు. ఇప్పటి వరకూ 40.82 లక్షల
అనుమానిత కేసుల్లో 34.43 లక్షల మంది పేషెంట్లను ఫ్యామిలీ డాక్టర్
పరిశీలించారని, అందులో 18.75 లక్షల మందికి అసాంక్రమిక వ్యాధులను
నిర్ధారించామని వివరించారు. ఇందులో కేవలం రక్తపోటు బాధితుల సంఖ్య 7.38,834,
కాగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 3,91,941, రక్తపోటు మధుమేహ బాధితుల సంఖ్య
7,45,129గానూ తేలిందన్నారు. మిగిలిన 5.39 లక్షల కేసులను 2 నెలల్లోగా
పరీక్షించి నిర్ధారిస్తామన్నారు. నిర్ధారింపబడిన అన్ని కేసులను ఫ్యామిలీ
డాక్టర్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల ద్వారా ఫాలోఅప్ చేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫ్యామిలీ
డాక్టర్ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులను గ్రామాలకు పంపి వైద్యసేవలతో పాటు
వ్యాధి నిరోధక సేవలను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు
తీసుకుంటోందన్నారు. ఈ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కింద ఒక్కో వైద్యాధికారి
ప్రతి 15 రోజులకోసారి నిర్దేశిత గ్రామాన్ని సందర్శించి అక్కడి హెల్త్ క్లినిక్
లో సేవలందిస్తున్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంహెచ్ఎల్పి), ఎఎన్ఎం, ఆశా
వర్కర్లు, వాలంటీర్ల సహాయంతో ప్రజలకు వైద్య సేవలందిస్తారని కృష్ణబాబు
వివరించారు. ఈ కేంద్రాలలో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలకు అవసరమైన
పరికరాలను అందుబాటులో వుంచామన్నారు. ఆరోగ్య పరిరక్షణా సేవలలో టెక్నాలజీ పాత్ర
విస్మరించలేనిదన్నారు. టెక్నాలజీ సాయంతో డిజిటల్ హెల్త్ సాల్యూషన్స్, టెలి
మెడిసిన్, ఆరోగ్య సమాచార వ్యవస్థల ద్వారా భౌగోళిక హద్దులను చెరిపివేసి
పేషెంట్లకు సమర్ధవంతమైన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. కృష్ణబాబు
వివరించిన హార్ట్స్ కార్యాచరణ ప్రణాళికపై ఆహూతులందరూ హర్షం వ్యక్తం చేశారు.
2025 నాటికి 7.5 కోట్ల మంది ప్రజలకు ప్రామాణిక వైద్య ఆరోగ్య సేవలందించేందుకు
సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. తాను, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ
అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళికపై చర్చలకు, అభిప్రాయ మార్పిడికి వేదికగా
నిలిచిన ఈ కార్యక్రమ నిర్వాహకులకు, ఈ ప్రణాళికపై హర్షామోదాలు తెలియచేసిన
వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హార్ట్స్ వ్యూహం ఇదే : ఆరోగ్యవంతమైన జీవన విధానంపై కౌన్సెలింగ్ ఆధారంతో కూడిన
చికిత్సా విధానాలు
అందుబాటులో అవసరమైన మందులు, టెక్నాలజీ
• రిస్క్ ఆధారిత నిర్వహణ
• టీమ్ ఆధారిత ఆరోగ్య పరిరక్షణా సేవలు
• పర్యవేక్షణ కోసం వ్యవస్థలు