ఎలక్ట్రానిక్ మీడియాకు కొత్త జిల్లాల్లో ఆదనంగా రెండు అక్రిడేషన్లు
హామీ ఇచ్చిన రాష్ట్ర సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి
విజయవాడ : అక్రిడేషన్ల మంజూరులో జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు
తీసుకుంటామని సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఏపీయూడబ్ల్యూజే నాయకత్వ బృందం బుధవారం సమాచార శాఖ కమిషనర్ ను ప్రత్యేకంగా
కలిసి చర్చలు జరిపింది. దీనిపై కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి సానుకూలంగా
స్పందించారు. అన్ని మండలాల్లో పనిచేసే విలేకరులకు గతంలో లాగే అక్రిడేషన్
ఇవ్వటానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల డిపిఆర్ఓ లకు సమాచారం
అధికారికంగా పంపిస్తామని తెలిపారు. సంబంధిత జర్నలిస్టులు డిపిఆర్ఓలను
సంప్రదించి వారి సూచనలు మేరకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు. చిన్న
పత్రికలకు పాత జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా కొత్త జిల్లా కేంద్రానికి
కూడా అక్రిడేషన్ ఇవ్వడానికి సమాచార శాఖ కమిషనర్ ఆమోదం తెలిపారు. ఎలక్ట్రానిక్
మీడియాకు కొత్త జిల్లా కేంద్రానికి అదనంగా రెండు అక్రిడేషన్లు ఇవ్వటానికి కూడా
పరిశీలన చేసి ఇచ్చే విధంగా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో సమాచార
శాఖ జాయింట్ డైరెక్టర్ కస్తూరి కూడా పాల్గొన్నారు. సమాచార శాఖ కమిషనర్ ను
కలిసిన వారిలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు,
ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐ వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు
జనార్ధన్, ఉపాధ్యక్షులు కంచల జయరాజ్ ,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్
అసోసియేషన్ అధ్యక్షులు ఏచూరి శివ , ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు చావా
రవి, అర్బన్ జిల్లా కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
నాగరాజు , తదితరులు సమాచార శాఖ కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు.